మళ్లీ తెరపైకి విజయనగర సామ్రాజ్యం

16 Jul, 2020 19:10 IST|Sakshi

మళ్లీ తెరపైకి విజయనగర సామ్రాజ్యం

చేజారిన మాన్సాస్‌పై టీడీపీ  కుతంత్రాలు

సంచయితపై బురద జల్లే విధంగా కుట్ర రాజకీయాలు

సాక్షి, విజయనగరం : మరోసారి విజయనగరం రాజుల పోరు తెరపైకి వచ్చింది. వివాదంగా మారిన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలపై చైర్ పర్సన్ సంచయిత జోక్యం చేసుకోవడాన్ని అశోక్ గజపతిరాజు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చంద్రబాబుతో కలిసి తరచూ సంచయిత గజపతిరాజుపై ఎదురుదాడికి దిగుతూ విమర్శలు చేస్తున్నారు. అయితే తానే అసలైన వారసురాలినని, తనకు ప్రజా సేవే ముఖ్యమంటూ దూకుడుగా వెళ్తున్న సంచయితపై బురద జల్లేందుకు టీడీపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. గత కొన్ని‌నెలలుగా వివాదంలో నలుగుతున్న పేరు విజయనగరం మాన్సాస్ ట్రస్ట్. ఒకప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన ఈ ట్రస్ట్ గడిచిన అయిదారేళ్లగా పూర్తిగా అవినీతిలోనే కూరుకుపోయింది.. తాజాగా ఈ ట్రస్ట్ కి చైర్ పర్సన్‌గా దివంగత ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అశోక్ గజపతిరాజు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత కొన్ని నెలలుగా మాన్సాస్ లో జరిగిన అక్రమ వ్యవహారాలను వెలికి తీసేందుకు చైర్ పర్సన్ సంచయిత చేస్తున్న ప్రయత్నాలు ఆమె వ్యతిరేకులకి‍ మింగుడుపడటంలేదు. (చంద్రబాబు టార్గెట్‌ చేస్తున్నారు: సంచయిత)

చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్
ఇప్పటికే సంచయిత గజపతిరాజుకి చైర్ పర్సన్‌గా అర్హత లేదంటూ కోర్టుని ఆశ్రయించిన ఆమె బాబాయి అశోక్ గజపతిరాజు గత కొన్ని నెలలుగా చంద్రబాబుతో కలిసి కుట్ర రాజకీయాలకి పాల్పడుతున్నట్లు సంచయిత ఆరోపిస్తున్నారు. దీనికి నిదర్సనంగా రెండు రోజుల‌క్రితం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన విమర్సలు అద్దం పడుతున్నాయి. ట్రావెన్ కోర్‌‌ మాదిరిగానే వారసులుకే మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు అప్పగించాలంటూ చంద్రబాబు చేసిన ట్వీట్‌కు సంచయిత గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పీవీజీ రాజు గారి అసలైన వారసులు తన తండ్రి ఆనంద గజపతిరాజు అయితే ఆయన అసలైన వారసురాలు తానేనని ఘాటుగా రీట్వీట్ చేశారు. ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్ విషయంలో అసలైన వారసులనే నియమించిందంటూ చురకలు అంటించారు. ఇప్పటికైనా చంద్రబాబు మాన్సాస్ ట్రస్ట్ పై రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. (చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్‌!)

అశోక్ గజపతిరాజు అసలైన కోణం
వాస్తవానికి గత ఏడాది సింహాచలం దేవస్ధానంతో పాటు మాన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్‌గా ఆనంద గజపతిరాజు వారసురాలిగా సంచయిత గజపతిరాజుకి నియామకం చేయడాన్ని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు జీర్ణించుకోలేకపోయారు. చిన్న వయస్సులో తన అన్న కూతురుకి ఆ అవకాశం రావడంపై హర్షించాల్సిన అశోక్ గజపతిరాజు తనలోని అసలైన కోణాన్ని బయటపెడుతూ వ్యతిరేకించారు. ఆమెకు తమ కుటుంబంతో సంబంధం‌ లేనట్టుగా.. తామొక్కరే పీవీజీ రాజు వారసులిగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయంలో మరో ముందడుగు వేసి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. వాస్తవానికి సంచయిత గజపతిరాజు గత కొన్ని సంవత్సరాలుగా సన అనే స్వచ్చంద సంస్ధను స్ధాపించి విశాఖ, ఢిల్లీ తదితర ప్రాంతాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పట్లో టీడీపీ మంత్రులు, ఎంపీలు సైతం ఈమె సేవా కార్యక్రమాలలో పాల్గొని అభినందించిన సంధర్బాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు  సేవా కార్యక్రమాలను ప్రశంసించిన నేతలే ఆమెపై తాజా ఎదురుదాడికి పాల్పడుతూ విమర్శలు చేయడం ఆశ్చర్యం కలిగించకమానదు. (బాబాయ్‌ భ్రష్టు పట్టించారు)

తండ్రి చితిమంటలు పూర్తిగా ఆరకముందే
అయితే ఆమె మాన్సాస్ ట్రస్ట్కి చైర్ పర్సన్గా నియమితులైన తర్వాతే టార్గెట్ చెస్తూ టీడీపీ విమర్శలకు దిగడం ప్రారంభించింది. ఇదే సమయంలో తరచూ తనపై చేస్తున్న కుట్రలు, ఆరోపణలపై చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు అదే రీతిలో గట్టిగానే సమాధానాలు ఇచ్చేవారు‌. అయితే గత కొద్ది రోజులగా టీడీపీ తనపై ఉద్దేశ పూర్వకంగా విమర్శలు చేస్తోందని, ఎన్టీఆర్ మహిళలకి సమాన హక్కులు కల్పిస్తే చంద్రబాబు, అశోక్ గజపతిలు మాత్రం లింగ వివక్ష చూపుతున్నారని అన్నారు. ఇదే సమయంలో మాన్సాస్లో అక్రమాలు జరగకపోతే ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. తన తండ్రి చితిమంటలు పూర్తిగా ఆరకముందే అశోక్ గజపతి రాజుకి చైర్ పర్సన్ పదవి కట్టబెడుతూ రాత్రికి రాత్రే జీఓ ఇవ్వడం సమంజసమా అని ప్రశ్నించారు. చంద్రబాబు, తన బాబాయ్ అశోక్ గజపతిరాజులకి మాన్సాస్పై ప్రేమ కంటే అధికారంపై మక్కువన్నారు. నిజంగా చంద్రబాబుకి సింహాచలం దేవస్ధానంపై అభిమానం ఉంటే తన తండ్రి, తాతలా సంపాదించిన ఆస్తుల్లో 500 కోట్లు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. సంచయిత గజపతిరాజు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకి ఇచ్చిన కౌంటర్ తీవ్ర కలకలమే రేపుతోంది. ఊహించని విధంగా సంచయిత గజపతిరాజు నుంచి రీట్వీట్ ఎదురుకావడంతో చంద్రబాబు మాత్రం గప్ చుప్ అయ్యారు.

మరిన్ని వార్తలు