బాబు.. కరువు.. కవలలు

15 Mar, 2019 11:25 IST|Sakshi
నిన్ను నమ్మం బాబు

14 ఏళ్ల  బాబు  పాలనలో పదేళ్లపాటు కరువే  

సాక్షి,అనంతపురం అగ్రికల్చర్‌: టీడీపీ పాలనలో రైతులు పొట్ట నింపుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. వరుస కరువులతో వ్యవసాయమే కాదు పాడి, పశుపోషణ కూడా భారంగా మారింది.  పశుగ్రాసం లేక కాడెద్దులు, పాడి ఆవులు, గేదెలు కబేళాలకు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు హయాంలో చూస్తుండగానే పశుసంపద కరిగిపోయింది. ఇటీవల పశుసంవర్ధకశాఖ చేపట్టిన సర్వేలో ఈ దారుణ విషయాలు వెలుగుచూశాయి.  

వరుస కరువులు 
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పాలించిన కాలంలో కరువులు రాజ్యమేలాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆయన 14 ఏళ్ల హయాంలో 10 ఏళ్లు సాధారణం కన్నా తక్కువ వర్షాలు పడ్డాయి. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 553 మి.మీ కాగా... అందులో 10 సంవత్సరాలు సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా కరువు మండలాలు జాబితాలోకి చేరడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. 25 లక్షల ఎకరాల వేరుశనగ లాంటి వ్యవసాయ పంటలతో వేలాది ఎకరాల్లో పట్టు, పండ్లతోటలు కూడా వర్షాభావానికి గురయ్యాయి.

వీటితో పాటు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక పాడి, పశుపోషణ రైతుకు భారం కావడంతో పశుసంపద తరిగిపోయింది. మేత సమస్య తీవ్రం కావడంతో కాడెద్దులు, పాడి పశువులను అయినకాటికి తెగనమ్ముకున్న పరిస్థితి ఏర్పడింది. పశుసంపద తరిగిపోవడంతో రైతుకు సేద్యం భారంగా పరిణమించింది. 

కనుమరుగవుతున్న పశుసంపద 
వరుస కరువులతో జిల్లాలో పశుసంపద బాగా తగ్గిపోయింది. పశుసంవర్ధకశాఖ గణాంకాల మేరకు..  2007తో పోల్చుకుం టే 2012లో మూగజీవాల సంఖ్య 24 శాతం తగ్గిపోయింది. 2019లో మరో 25 శాతం మేర పడిపోయింది. 2007లో జిల్లా వ్యాప్తంగా 14.47 లక్షల సంఖ్యలో పశుసంపద ఉండగా 2012 నాటికి 10.29 లక్షలకు పడిపోయింది. తాజాగా నిర్వహించిన సర్వేలో అది కాస్త 7.75 లక్షలకు పరిమతమైంది. మేకలు కూడా 2007లో 10 లక్షలు ఉండగా 2012 నాటికి 8.98 లక్షలకు తగ్గిపోయాయి. ఇపుడు 8.38 లక్షలకు చేరుకున్నాయి.  

వ్యవసాయం, పాడి బాగా దెబ్బతినడంతో చాలా మంది గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పందులు, కుక్కలు, గాడిదలు లాంటి మిగతా జీవాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. రైతు ప్రభుత్వమంటూ గొప్పలకు పోవడం తప్ప చంద్రబాబు సాధించిన ఘనత ఏదీ లేదంటూ రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మరోసారి అవకాశం ఇస్తే మొదటికే మోసం వస్తుందని జనం భావిస్తున్నారు.

ఎక్కడికెళ్లినా జీవాలకు మేత దొరకడం లేదు. మైదాన ప్రాం తాల్లో మేత  లేదు. పొలాల వద్ద కూడా  అదే పరిస్థితి  గడ్డి కొరత వల్ల ఇప్పటికే సగం జీవాలను అమ్ముకున్నాం. ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు.

 – వన్నూరప్ప, గొర్రెల కాపరి, కనగానపల్లి 

మరిన్ని వార్తలు