ఎస్‌ఐపీబీలో ఇద్దరు బాబులదే పెత్తనం!

10 Mar, 2019 10:31 IST|Sakshi

మిగతా సభ్యులు లేకుండానే పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశాలు 

భేటీకి హాజరుకాని మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి 

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌

సాక్షి, అమరావతి : రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) సమావేశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కలిసి నిర్వహిస్తుండడం మంత్రుల్లో, అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు గత నెల 9వ తేదీన, ఈ నెల 6వ తేదీన ఎస్‌ఐపీబీ సమావేశాలు నిర్వహించారు. పలు ఐటీ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా భారీ రాయితీలు ఇచ్చేశారు. ఎస్‌ఐపీబీకి కన్వీనర్‌గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఈ రెండు సమావేశాలకు హాజరు కాకపోవడం గమనార్హం. ఎస్‌ఐపీబీ సమావేశాలంటే పెదబాబు, చినబాబుల ఇష్టారాజ్యంగా మారిందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

అందుబాటులో ఉండి కూడా..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి లేకుండా ఎస్‌ఐపీబీ సమావేశాలు నిర్వహించిన దాఖలాలు గత ప్రభుత్వాల హయాంలో ఎప్పుడూ లేవని అధికారులు గుర్తుచేస్తున్నారు. వచ్చే పదేళ్లపాటు పలు ఐటీ కంపెనీలకు రాయితీలు ఇస్తూ ఎస్‌ఐపీబీ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు. ఎస్‌ఐపీబీకి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. సభ్యులుగా ఆర్థిక, రెవెన్యూ, ఐటీ, మున్సిపల్, వ్యవసాయ, కార్మిక, ఉపాధి, శిక్షణ, పరిశ్రమలు, ఇంధన శాఖ మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు ఉంటారు. సభ్య కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం 2017 ఏప్రిల్‌ 20న జీవో నం.51 జారీ చేసింది.

అయితే, ఫిబ్రవరి 9న నిర్వహించిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి, సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి సాయి ప్రసాద్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోఖ్యరాజ్, ఏపీఐఐసీ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అహ్మద్‌బాబు మాత్రమే పాల్గొన్నారు. మిగతా మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత శాఖల కార్యదర్శులు పాల్గొనలేదు. అలాగే ఈ నెల 6న నిర్వహించిన ఎస్‌ఐపీబీ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి అందుబాటులో ఉండి కూడా హాజరు కాలేదు. మిగతా సభ్యులైన మంత్రులు కూడా హాజరు కాలేదు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి విజయానంద్, సీఎం కార్యాలయ కార్యదర్శి గిరిజాశంకర్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్‌ మాత్రమే పాల్గొన్నారు. 

సమావేశం కంటే ముందే నిర్ణయాలు 
ఎన్నికల ముందు హడావిడిగా ఎస్‌ఐపీబీ సమావేశాలు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నందువల్లే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఆర్థిక శాఖ కార్యదర్శి హాజరుకాలేదని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ ఎవరికి, ఏ కంపెనీలకు ఏ ధరకు భూములు ఇవ్వాలి, ఎన్ని రాయితీలు ఇవ్వాలనే విషయాన్ని ముందుగానే నిర్ణయించేస్తున్నారని, తరువాత ఎస్‌ఐపీబీ సమావేశం ఏర్పాటుచేసి అందులో ఆమోదింపజేస్తున్నారని, అలాంటి సమావేశాలకు వెళ్లడం కంటే దూరంగా ఉండటమే మేలని మంత్రులు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే వారు హాజరుకావడం లేదని తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు