కీలక బిల్లులపై చర్చకు దూరంగా టీడీపీ

25 Jul, 2019 05:05 IST|Sakshi

సభ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు 

బిల్లుల విషయంలో ప్రజల దృష్టి మళ్లించేందుకే..  

సాక్షి, అమరావతి: శాసనసభలో అత్యంత కీలకమైన బిల్లులపై చర్చకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న సాకుతో రెండు రోజులు సభ నుంచి చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వాకౌట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదించింది. కానీ, చంద్రబాబు మాత్రం సభలో వాటి గురించి చర్చించేందుకు ఇష్టపడకుండా ఇతర అంశాలను లేవనెత్తి గొడవ చేయడం, వాకౌట్‌ చేసి వెళ్లిపోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మంగళవారం అత్యంత ప్రతిష్టాత్మకమైన బిల్లులుగా భావిస్తున్న శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు, నామినేటెడ్‌ పదవులు, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులు, నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఆమోదించడానికి ముందు చర్చ మొదలవుతుండగానే టీడీపీ ఎమ్మెల్యేలు సభలో రచ్చ చేయడానికి ప్రయత్నించారు. దీంతో స్పీకర్‌ ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశారు. అయినా టీడీపీ సభ్యులు దానిపైనే సభలో కొద్దిసేపు ఆందోళన చేసి ఆ తర్వాత వాకౌట్‌ చేశారు. తమది బీసీల పార్టీ అని పదేపదే చెప్పుకునే టీడీపీ అదే బీసీలకు సంబంధించిన అత్యంత కీలకమైన బిల్లులపై కనీసం మాట్లాడకుండా వెళ్లిపోవడం ఏమిటని ఆయా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.  పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలిచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుపై బుధవారం అసెంబ్లీలో చర్చ జరుగుతుందని తెలిసినా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నోత్తరాల సమయంలోనే ఆందోళనకు దిగి, వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు. 

అంతా వ్యూహాత్మకంగానే...
కీలకమైన బిల్లులపై చర్చలో పాల్గొనకుండా చంద్రబాబు వ్యూహాత్మకంగా సభ నుంచి జారుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేసి, మీడియా సమావేశాల్లో తన వాదన వినిపిస్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలతో సరిపెడుతూ కనీసం ఆ బిల్లులపై మాట్లాడకపోవడం గమనార్హం. ప్రతిష్టాత్మకమైన బిల్లుల విషయంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు, టీడీపీ సభ్యులు అనుచితంగా వ్యవహరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభలో అడ్డగోలుగా వ్యవహరించి సస్పెన్షన్ల వరకూ తీసుకెళ్లడం, దాన్ని అడ్డం పెట్టుకుని గొడవకు దిగడం, ధర్నాలు చేయడం, సభ నుంచి వాకౌట్‌ చేయడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్నదే టీడీపీ ఉద్దేశమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు