'బాబూ.. గరగపర్రుకు ఎందుకు వెళ్లలేదు'

8 Jul, 2017 17:06 IST|Sakshi
'బాబూ.. గరగపర్రుకు ఎందుకు వెళ్లలేదు'

గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేకి అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఇటీవల దళితులు, ఇతర కులాల వారి మధ్య ఘర్షణ జరిగిన గరగపర్రుకు చంద్రబాబు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. వైఎస్‌ఆర్‌ సీపీ జాతీయ ప్లీనరీ సమావేశంలో ప్రజాసంక్షేమంపై తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఆయన మాట్లాడారు.

కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు
'వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వృత్తిరీత్య డాక్టర్‌ అయినా..  పేదల సంక్షేమం కోసం పనిచేశారు. ఆ మహానేత పాలనలో రాష్ట్రంలోని కులమతాలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యశ్రీ  ఓ వరం. ఈ పథకం ద్వారా ప్రత్యేక ఒరవడి తీసుకొని వచ్చారు. వైఎస్‌ఆర్‌ హయాంలో అడిగిన వారందరికీ ఇల్లు ఇచ్చారు. 45 లక్షల ఇళ్లు కట్టారంటే పేదల కోసం వైఎస్‌ఆర్‌ ఎంత తపించారో తెలుస్తుంది. అడిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇచ్చారు. పేద, బడుగు, బలహీన వర్గాలు చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ఎలా ఉపయోగపడిందో చూశాం. వైఎస్‌ఆర్‌ మరణం తరువాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆయన ఎస్సీలు, బీసీలకు ఏం చేశారో కూడా తెలియదు. ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. హామీలు అటకెక్కాయి. అంబేడ్కర్‌ ఆలోచన విధానంలో పనిచేసిన ఏకైన వ్యక్తి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌' అని ఆయన వివరించారు.

సబ్‌ప్లాన్‌ను నిర్వీర్యం చేశారు
'ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. దళితులకు రావాల్సిన నిధులు సరిగా ఖర్చు చేయలేదు. కాగ్‌ నివేదిక సైతం చంద్రబాబు ఈ నిధులను మింగేసినట్టు చెప్పింది. వైఎస్‌ఆర్‌ హయాంలో భూమి లేని నిరుపేదలకు భూములు ఇచ్చారు. అటవీ హక్కుల చట్టాన్ని వైఎస్‌ఆర్‌ అమలు చేస్తే ఈ రోజు ఒక్క సెంట్‌ భూమి కూడా దళిత, గిరిజనులకు పంపిణీ చేయడం లేదు. దళితుల భూములు లాక్కుంటున్నారు. పది వేల ఎకరాల భూమి లాక్కున్నారు.

ఇదేనా సంక్షేమం? ఇదేనా అభివృద్ధి. దళిత వ్యతిరేక ముఖ్యమంత్రి చంద్రబాబు. దళితులుగా ఎవరు పుట్టాలని అనుకుంటారని వ్యాఖ్యలు చేశారు. ఆయన దొరికిపోయిన ఓటుకు కోట్లు కేసు, కాల్‌మనీ కేసుల గురించి ప్రశ్నిస్తే నోరు నొక్కేలా మాట్లాడుతున్నారు. గరగప్రరుకు ఎందుకు రాలేకపోయావు చంద్రబాబు. మా నాయకుడు ఆ గ్రామానికి వెళ్లి అందరితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు. సంక్షేమం లేదు' అని మేరుగ నాగార్జున అన్నారు. 'వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు మేం తీర్మానం ప్రవేశపెట్టాం. ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కులను కాపాడాలి. మెస్‌ చార్జీలు పెంచాలి, హాస్టళ్ల మూసివేత సరికాదు. ప్రజల భూములు లాక్కున్న తీరుపై సీబీఐ విచారణ చేపట్టాలి. గిరిజన, బీసీ, ఎస్సీ వర్గాల సంక్షేమానికి వైఎస్‌ఆర్‌సీపీ కట్టుబడి ఉంది' అని మేరుగ నాగార్జున అన్నారు.