హౌసింగ్‌ పేరుతో బాబు  చీటింగ్‌...! 

1 Apr, 2019 11:08 IST|Sakshi

సాక్షి, విజయవాడ : పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఆవాస్‌యోజన పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసినా వాటిని పూర్తిస్థాయిలో నిర్మించలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. నిర్మించిన కొద్దిపాటి ఇళ్లను తెలుగుదేశం ఎమ్మెల్యేల ద్వారా కార్యకర్తలకు ఇప్పించడంతో అర్హులైన లబ్ధిదారులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్మించే ఇళ్లకు చంద్రన్న హౌసింగ్‌గా పంపిణీ చేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. 

జిల్లాకు మంజూరైనవి 57 వేల ఇళ్లు 
కృష్ణాజిల్లాకు మొత్తం 57 వేల ఇళ్లు మంజూరయ్యాయి. విజయవాడ నగరంతో పాటు మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు, గుడివాడ,  నందిగామ, జగ్గయ్యపేట, నూజీవీడు, తిరువూరు, మున్సిపాలిటీలలో ఈ ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే ఇళ్ల నిర్మాణం పూర్తిగా కాలేదు.   హడావుడిగా గృహప్రవేశాలు చేయించి అందరికీ ఇళ్లు ఇచ్చినట్లు చెబుతున్నారు.

వాల్‌ టెక్నాలజీతో భారం 
పేదలకు కట్టించే ఇళ్లను షియర్‌ వాల్‌ టెక్నాలజీతో ప్రభుత్వం నిర్మించింది.  ఈ షియర్‌ వాల్‌ టెక్నాలజీ వల్ల ఒక్కొక్క లబ్ధిదారుడుపైనా సుమారు రూ.2 లక్షల వరకు ఆర్ధి్దక భారం çపడుతోంది.  ఈ ఇళ్లు అంత గొప్ప నాణ్యత ఏమీ ఉండబోమని, సాధారణ ఇళ్లకంటే ఏమాత్రం భిన్నంగా ఉండవని కాంట్రాక్టర్లు, సివిల్‌ ఇంజనీర్లు చెబుతున్నారు. షియర్‌వాల్‌ టెక్నాలజీ అంటే...  గోడలను ఏ విధంగా నిర్మిస్తారో స్లాబ్‌ కూడా అదే మెటీరియల్‌తో నిర్మిస్తారు.  

దూరం.. భారం!
జీ+3 పద్ధతిలో ఈ ఇళ్లు నిర్మిస్తున్నారు. నిళ్ల నిర్మాణానికి కావాల్సిన స్థలం ప్రభుత్వమే సమకూర్చాల్సి రావడంతో  ఊరుకుదూరంగా మూడు నాలుగు కి.మీ దూరంలో నిర్మిస్తున్నారు. దీంతో అక్కడ ఉండలేక ఇళ్లు వదులుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో జక్కంపూడిలో నిర్మించడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

స్థలం కొనుగోలుకు నిధులు నిల్‌ 
విజయవాడలో ఇంకా 20వేల ఇళ్లు నిర్మించాల్సి ఉంది. దీని కోసం సుమారు 100 ఎకరాల స్థలం అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీనికోసం జక్కపూడిలో సుమారు 106 ఎకరాల భూమిని రైతులు వద్ద నుంచి సేకరించాలని నిర్ణయించారు. ఈ రూ.100 కోట్లు మంజూరు కోసం ప్రభుత్వం ఆరు నెలల క్రితం జీవో కూడా ఇవ్వడంతో అధికారులు ఈ నిధులు విడుదల కాగానే రైతుల వద్ద  నుంచి భూములు తీసుకుం టామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం  ఒక్క రూపాయీ ఇవ్వలేదు.

జగన్‌ హామీతో హర్షం
పట్టణ పేదలకు ఇళ్లు రుణాలుగా తీసుకుంటే వాటిని తాను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో నిరుపేదలైన పేదలకు ఇళ్లమీద ఆశలు పెంచింది. తాను  అధికారంలోకి వస్తే 25 లక్షలు ఇళ్లు నిర్మించి పేదలందరికీ  ఇస్తామని హామీ ఇచ్చారు. అక్క చెల్లెమ్మలకు గృహప్రవేశం రోజునే రిజిస్ట్రేషన్‌ పట్టా ఇస్తామని, పావలా వడ్డీకే ఇంటి పై బ్యాంకు రుణం ఇప్పిస్తానని నవరత్నాల్లో ఇచ్చిన హామీల పట్ల పేద ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆయన ప్రకటనతో దీంతో జిల్లాలో దరఖాస్తులు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఎన్నికల తరువాత జగన్‌ వస్తే తమకు ఇళ్లు వస్తాయని మహిళలు     ఆశతో ఎదురు చూస్తున్నారు.

టీడీపీ ఎమ్మెల్యేలకు కాసులు కురిపించిన పేదల ఇళ్లు 
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన నిధులతో నిర్మించిన ఇళ్లను టీడీపీ ఎమ్మెల్యేలు య«థే చ్ఛగా విక్రయించుకున్నారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు  మూడేసి వేల ఇల్లు చొప్పున కేటాయించారు. దీంతో ఎమ్మెల్యేలు తమ అనుచరులు ద్వారా రూ.50 వేలు తీసుకుని ఇళ్లు కేటాయించారని చెబుతున్నారు. విజయవాడలో ఒక ఎమ్మెల్యే అనుచరులు రూ.40 లక్షలు ఇళ్లు ఇప్పిస్తామంటూ వసూలు చేశారు.

క్రీస్తు రాజపురంలో ఒక మహిళ ఆటోస్టాండ్‌ అధ్యక్షురాలు ద్వారా 20 మందికి ఇళ్లు ఇప్పిస్తామంటూ రూ.10 లక్షలు వరకు వసూలు చేశారు. అలాగే బస్టాండ్‌లో ఉన్న ఒక ఆటోస్టాండ్‌ అధ్యక్షుడు ద్వారా మరో 25 మంది వద్ద నుంచి రూ.15 లక్షలు వసూలు చేశారు. సింగనగర్‌లో చిట్స్‌ నిర్వహించే ఒక మహిళ ద్వారా సుమారు 30 మంది నుంచి మరో రూ.15 లక్షలు వసూలు చేశారు. అయితే వీరికి ఇళ్లు మంజూరు కాలేదు.

గుడివాడలో అయోమయం
పట్టణంలో పేదలకు ఇళ్లు నిర్మించాలని అందుకు కావలసిన స్థలం కొనుగోలు చెయ్యాలని 2007లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) గుడివాడ నుంచి హైదరా బాద్‌కు పాదయాత్ర చేశారు. ఒక శాసన సభ్యుని పాదయాత్రకు స్పందించిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అందుకు కావలసిన నిధులు కేటాయించారు.

దీంతో బొమ్ములూరు మలుపు వద్ద 74 ఎకరాలు భూమి కొనుగోలు చేశారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆ భూములు నిరుపయోగంగా మారిపోయాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం హౌస్‌ ఫర్‌ ఆల్‌ పథకం క్రింద పట్టణానికి ఆ పథకాన్ని వర్తింప చేసింది. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం రూ 1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ 1 లక్ష సబ్సిడీగా అందచేస్తుంది. లబ్ధిదారుడు డబుల్‌ బెడ్‌రూమ్‌ 430 చదరపు అడుగులకు లక్షరూపాయలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ 365 చదరపు అడుగులకు రూ.50 వేలు, సింగిల్‌ బెడ్‌ రూమ్‌కు రూ.500 చెల్లించాలని నిబంధన చేశారు.

మిగిలిన మొత్తాలను జాతీయ బ్యాంకుల ద్వారా రుణం అందచేసి లబ్ధిదారుడు నెలవారి తీర్చుకునేలా పథకం రూపొందించారు. దీనిని అవకాశంగా తీసుకున్న తెలుగుదేశం నాయకులు కేంద్ర ప్రభు త్వ పధకాన్ని పూర్తిగా చంద్రబాబు నాయుడే పట్టణ ప్రజలను కరుణించినంత ప్రచారం చేసుకున్నారు. ఈ పథకం నిమిత్తం ప్రతి లబ్ధిదారుని వద్ద నుంచి సొమ్ము వసూళ్లు చేసేశారు.

పెడనలో అడుగు పడలేదు!
పురపాలక సంఘంలోని అర్హులైన సొంత స్థలాలు లేని నిరుపేదలకు జీ ప్లస్‌ త్రి గృహాలు నిర్మించాలనే ప్రభుత్వం ప్రతిపాదనలు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్న చందాన పరిస్థితి ఏర్పడింది. చివరకు చేతులు ఎత్తిసేంది.  జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో జీ ప్లస్‌ త్రీ పరిస్థితి బాగున్న పెడనలో రిక్తహస్తం చూపింది.

2017లో ఈ పథకానికి అంకురార్పణ జరిగినా ఉన్నతాధికారులు మాత్రం ప్రైవేటు స్థలాలు కొనుగోలు చేసి ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. మరోపక్క పురపాలక శాఖామాత్యులు నారాయణ మాత్రం అవసరమైతే ఎకరానికి రూ.60 లక్షలు వెచ్చించి అయినా నిరుపేదల ఇంటి కలలను సాకారం చేస్తామని పేర్కొన్నా ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. టీడీపీకి చెందిన నాయకులే స్వయంగా పలు ప్రైవేటు స్థలాలను పరిశీలించి రైతులను ఒప్పించి ప్రభుత్వ అధికారుల దృష్టిలో పెట్టినా  ఆ స్థలాలను కొనుగోలు చేసేందుకు అధికారులు ఆసక్తి చూపించకపోవడం గమనార్హం.

అధికారులు మాత్రం పురపాలక సంఘానికి చెందిన డంపింగ్‌ స్థలం 6.27 ఎకరాలు స్థలం, తామర చెరువు 13 ఎకరాలను పరిశీలించారు. డంపింగ్‌ యార్డు స్థలం ఇచ్చేస్తే భవిష్యత్తులో  ఇబ్బందులు రావచ్చుననే ఉద్దేశంతో డంపింగ్‌ యార్డు కోసం కొనుగోలు చేసిన స్థలాన్ని అప్పగించడానికి కౌన్సిల్‌ అంగీకరించలేదు. 

నందిగామలో అవిగో.. ఇవిగో...
నందిగామ : నగర పంచాయతీ వాసులకు జీ ప్లస్‌ త్రీ నిర్మాణాలు అందని ద్రాక్షగా మారాయి. మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు పనులు పునాదుల దశను దాటలేదంటే పథకం నిర్వహణ పట్ల పాలకులు, అధికారులకు ఎంత చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జీ ప్లస్‌ త్రి నిర్మాణాల పేరిట నందిగామ నగర పంచాయతీ వాసులను ఊరించడమే తప్ప ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చిత్తశుద్ధితో ప్రయత్నించిన దాఖలాలు లేవు.

వాస్తవానికి ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం కింద నందిగామ నగర పంచాయతీకి 2,496 గృహాలు మంజూరయ్యాయి. స్థలా భావం వల్ల వేర్వేరుగా కాకుండా జీ ప్లస్‌ త్రి విధానంలో భవనాలు నిర్మించాలని సంకల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా. స్థల సేకరణ పెద్ద సమస్యగా మారింది. తొలుత డీవీఆర్‌ కాలనీలో వీటిని నిర్మిస్తామంటూ అధికార పార్టీ హడావుడి చేసింది.

కొన్ని నెలలు తాత్సారం చేసిన తరువాత రాఘవాపురం గట్టు వద్ద స్థలం సేకరించేశామంటూ ఆర్భాటంగా ప్రకటించడంతోపాటు సదరు స్థలాన్ని చదును చేసేందుకు హడావుడిగా పనులు మొదలు పెట్టారు. దీనిపై అనేక ఆరోపణలు రావడం, విజిలెన్స్‌ విచారణలు కూడా కొనసాగడంతో అక్కడ నుంచి కూడా స్థలాన్ని మార్చేశారు. ఈ క్రమంలోనే రెండేళ్లు గడచిపోయాయి. 

మరిన్ని వార్తలు