మోరి..వట్టి మోళీ..

20 Jun, 2018 06:36 IST|Sakshi

ఊరు ఇక ‘స్మార్ట్‌’అన్న చంద్రబాబు

నగదు రహితం, ఫైబర్‌ గ్రిడ్‌ అంటూ ఏడాదిన్నర కిందట ఆర్భాటం

ఓడీఎఫ్‌ గ్రామంగా ప్రకటన

ఆచరణలో చతికిలపాటు

నేటికీ కొనసాగుతున్న నగదు లావాదేవీలు

పని చేయని ఫైబర్‌గ్రిడ్‌ కనెక్షన్లు

 నూరు శాతం పూర్తి కాని మరుగుదొడ్ల లక్ష్యం

సఖినేటిపల్లి (రాజోలు): అది 2016 డిసెంబర్‌ 29వ తేదీ. మండలంలోని మోరి గ్రామంలో చంద్రబాబునాయుడు పర్యటించారు. భారీ సభ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా మోరి గ్రామాన్ని స్మార్ట్‌ విలేజ్‌గా ప్రకటించారు. ఈ గ్రామాన్ని ఫైబర్‌ గ్రిడ్‌తో అనుసంధానం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలి పూర్తి నగదు రహిత లావాదేవీలు జరిగే గ్రామమని, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామమని ఆర్భాటంగా ప్రకటించారు. తదనంతర కాలంలో మోరికి శివారుగా ఉన్న మోరిపోడు గ్రామాన్ని కూడా ప్రభుత్వం స్మార్ట్‌ విలేజ్‌ జాబితాలోకి చేర్చింది.

ఇంకేముంది..!
సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటన చేయడంతో ఇక మోరి గ్రామ స్వరూపమే మారిపోతుందని అందరూ అనుకున్నా రు. అయితే, చంద్రబాబు ప్రకటనలు ఆర్భాటానికే పరిమితమయ్యాయి. సు మారు ఏడాదిన్నర అవుతున్నా ఆచరణ అందుకు అనుగుణంగా లేదు. ఫైబర్‌ గ్రిడ్‌ కనెక్షన్లు పని చేయకపోగా.. నగదు రహితం పేరుకే  మిగిలింది. మరుగుదొడ్ల లక్ష్యం కూడా పూర్తి కాకపోవడంతో గ్రామంలో ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన కొనసాగుతోంది.

అరకొరగా ఫైబర్‌ గ్రిడ్‌
స్మార్ట్‌ విలేజ్‌ ప్రోగ్రాంలో భాగంగా మోరి, మోరిపోడు గ్రామాల్లో 1,500 ఫైబర్‌ గ్రిడ్‌ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటన్నింటినీ స్థానిక కేబుల్‌ ఆపరేటర్లు ఫైబర్‌ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. వీటిల్లో 300 కనెక్షన్లకు టీవీకి, ఫోన్‌కు పవర్‌ సప్లై చేసే ఐపీటీవీ బాక్సులలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. అవి ఇన్‌స్టాల్‌ కాకపోవడంతో రిప్లేస్‌మెంట్‌ నిమిత్తం వెనక్కి ఇచ్చేశారు. వీటిని రిప్లేస్‌ చేయనున్నట్లు స్థానిక కేబుల్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ 150 రిప్లేస్‌ చేసినా, మరో 150 కనెక్షన్లకు రిప్లేస్‌మెంట్‌ పూర్తి కావాల్సి ఉంది.

గ్రామ శివార్లలో ఫైబర్‌ గ్రిడ్‌తో అనుసంధానం చేస్తూ ఇచ్చిన సుమారు 300 కనెక్షన్లు వారంలో మూడు రోజులు సాంకేతిక, ఇతర సమస్యలతో పని చేయడం లేదు. టెరాసాఫ్ట్‌కు చెందిన పరికరాలు దెబ్బతిని, ఎక్కడైనా కేబుల్‌ తెగిపోతున్న సందర్భాల్లో ఆ వీధిలో ప్రసారాలు నిలిచిపోతున్నాయి. దీంతో గ్రామస్తులు కేబుల్‌ ప్రసారాలకే పరిమితమైపోయారు.

సాంకేతిక కారణాలతో ఇప్పటికీ ఫైబర్‌ గ్రిడ్‌ సేవలకు నోచుకోని కొన్ని టీవీలకు నో ఇంటర్నెట్‌ యాక్సెస్‌ వస్తోంది. దీంతో ఆ ఇంటి యజమానులు ఏం చేయాలో పాలుపోక, కేబుల్‌ ప్రసారాలతో సరిపెట్టుకుంటున్నారు.

పాటలకే పరిమితమైన స్మార్ట్‌ఫోన్లు
 నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు మోరి గ్రామంలో 600 మందికి స్మార్ట్‌ఫోన్లు అందజేశారు. అవి నాణ్యమైనవి కాకపోవడంతో కొద్ది కాలానికే సమస్యలు తలెత్తాయి.

ఫోన్‌ ఆన్‌ చేసిన వెంటనే బ్యాటరీ పని చేయక స్విచ్‌ ఆఫ్‌ అవడం, ఫోన్లలోని బ్యాటరీలు ఉబ్బిపోవడం తదితర సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ ఫోన్లు పనికిరాకుండా పోయాయి.

మరోపక్క సిగ్నల్‌ సమస్యలతో ఇంటర్‌నెట్‌ సక్రమంగా పని చేయక అవి నిర్దేశించిన లక్ష్యానికి దూరంగా మిగిలిపోయాయి. చివరకు సినిమా పాటలను వినడానికి మాత్రమే డ్వాక్రా మహిళలు వాటిని ఉపయోగించుకుంటున్నారు.

నగదుతోనే వ్యాపారం
గ్రామాన్ని నగదు రహితంగా సీఎం ప్రకటించగా.. ఇప్పటికీ ఇక్కడ నగదు లావాదేవీలే జరుగుతున్నాయి.

గ్రామంలో మెడికల్, కిరాణా, కూరగాయలు, పాన్‌షాప్‌.. ఇలా అన్నీ కలిపి సుమారు 40 వరకూ ఉన్నాయి. ప్రస్తుతం అన్ని దుకాణాల్లోనూ నగదు లావాదేవీలే జరుపుతున్నారు.

కొందరికి స్వైపింగ్‌ మెషీన్లు ఇచ్చినా సక్రమంగా పని చేయకపోవడంతో నగదు రహిత లావాదేవీలకు స్వస్తి పలికారు.మరికొంతమందికి స్వైపింగ్‌ మెషీన్లు చేరలేదు.కాగా, మోరి గ్రామానికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టిన జీడిపప్పు, చేనేత పరిశ్రమల్లో కార్మికులకు నగదు లేనిదే అడుగు ముందుకు పడడం లేదు.

ఓడీఎఫ్‌.. ఉఫ్‌..
మోరి, మోరిపోడు గ్రామాలను సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహితంగా (ఓడీఎఫ్‌) తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి అప్పట్లో ప్రకటించారు. కానీ, సీఎం చెప్పిన ఈ మాట కూడా ఆర్భాటంగానే మిగిలింది.

ఓడీఎఫ్‌ గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన నిషిద్ధం. నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరగాలి. కానీ, ఆచరణ అలా లేదు.

కొన్నిచోట్ల మరుగుదొడ్ల నిర్మాణాలను కాంట్రాక్టర్లకు అప్పగించడంతో వారు అరకొరగా నిర్మించి వదిలేశారు. అవి నిరుపయోగంగా మారాయి.

స్మార్ట్‌ విలేజ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ రెండు గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం 200 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఇప్పటికీ మంజూరు చేయలేదు. వీటిని వచ్చే ఆగస్ట్‌లో ఆన్‌లైన్‌ చేస్తామని, అప్పటివరకూ ఆగాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.

ఫలితంగా ఈ గ్రామాల్లో ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన కొనసాగుతోంది.మరోపక్క ఈ గ్రామాల్లో పారిశుధ్యం పరమ అధ్వానంగా ఉంది. గ్రామంలో చెత్త వేసేందుకు కనీసం డంపింగ్‌ యార్డు కూడా లేదు. ఇటీవల చెత్త రీ సైక్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసినా అది వినియోగంలోకి రాలేదు.

మరిన్ని వార్తలు