‘ అనంత’ ప్రజల నోట్లో మట్టి కొట్టిన సీఎం

23 Apr, 2016 04:24 IST|Sakshi
‘ అనంత’ ప్రజల నోట్లో మట్టి కొట్టిన సీఎం

 సీపీఐ జిల్లా కార్యదర్శి డీ.జగదీష్

గుంతకల్లు:  సీఎం చంద్రబాబునాయుడు కరువు సహాయక చర్యలు, హంద్రీనీవా పనులకు అవసరమైన నిధులు ప్రకటించకుండా ప్రజల నోట్లో మట్టి కొట్టారని సీపీఐ జిల్లా కార్యదర్శి డీ.జగదీష్ ఆరోపించారు.  స్ధానిక సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హంద్రీ నీవా పూర్తి కావాలంటే రూ.5వేల కోట్లు అవసరమన్నారు.  ప్రభుత్వం విడుదల చేసిన రూ.504 కోట్లు కరెంటు బిల్లులకు సరిపోవని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నపుడు ఎన్‌టీఆర్ సాగునీటి ప్రాజెక్టును కేవలం తాగునీటి ప్రాజెక్టుగా మార్చి జిల్లాకు అన్యాయం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకూడదని జీవో నం-22ను విడుదల చేసి డిస్ట్రిబ్యూటరీ పనులు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు.  

హంద్రీ నీవా పూర్తి కావడానికి నిధులు విడుదల చేసి రాజశేఖర్‌రెడ్డి సహకరిస్తే చంద్రబాబు దీనిని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.   జిల్లాకు రావల్సిన 24 టీఎంసీలు కేటాయించి  తర్వాత  కుప్పానికి నీటిని తరలిస్తే అభ్యంతరం లేదన్నారు. అనంతపురం జిల్లా భవిష్యత్తు కృష్ణ జలాల పైనే ఆధారపడి ఉందన్నారు. మేలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా   చేపట్టనున్నట్లు తెలిపారు. సీపీఐ జిల్లా సమితి సభ్యుడు అబ్దుల్‌వహాబ్, పట్టణ కార్యదర్శి ఎం.వీరభద్రస్వామి, సహాయ కార్యదర్శి బి.మహేష్, నాయకులు ఎస్‌ఎండీ గౌస్ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు