నాకు భద్రత కుదింపు సరికాదు

2 Jul, 2019 05:19 IST|Sakshi

హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిటిషన్‌

నేడు విచారించనున్న జస్టిస్‌ దుర్గాప్రసాదరావు

సాక్షి, అమరావతి: తనకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కుదించడాన్ని సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. జూన్‌ 25కు ముందు తనకు ఎలాంటి భద్రత ఉండేదో దాన్ని తిరిగి పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, గుంటూరు అర్బన్‌ ఎస్పీ, రాష్ట్ర భద్రత పునఃసమీక్ష కమిటీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు విచారణ జరపనున్నారు. తనకున్న జెడ్‌ ప్లస్‌ కేటగిరీని తగ్గించడం తన జీవించే హక్కును హరించడమేనని చంద్రబాబు తన పిటిషన్‌లో వివరించారు. గత 41 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, పలుమార్లు ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించానన్నారు. తాను మావోయిస్టులకు లక్ష్యంగా మారాననని, తనకున్న ముప్పు దృష్ట్యా తనకు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ కింద భద్రతను కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

భద్రత ఎక్కువే ఇచ్చాం: డీజీపీ
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు భద్రతను తగ్గించలేదని, నిబంధనల ప్రకారం ఆయనకు ఇవ్వాల్సిన భద్రత కంటే ఎక్కువే ఇచ్చామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. విజయవాడలో సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధుల భద్రత విషయంలో పోలీసు శాఖ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. మాజీ సీఎంకు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం భద్రత తగ్గిస్తోందనడం సరికాదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేది ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని డీజీపీ హెచ్చరించారు.

గెలుపు ఓటములు సాధారణం
ఎన్నికల్లో పార్టీల గెలుపోటములు సర్వసాధారణమని, అధికారపక్షం దాడులకు బలైన ఆరుగురి కుటుంబాలను త్వరలోనే తాను పరామర్శిస్తానని, పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఆయా కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో సోమవారం పలువురు నాయకులతో ఆయన సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో దాడులను నిలువరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు.

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల సమయం ఇద్దామనుకున్నా.. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడాన్ని సహించలేకపోతున్నామని తెలిపారు. తమ ప్రభుత్వంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపొచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళగిరి వద్ద నిర్మాణం అవుతున్న పార్టీ రాష్ట్ర కార్యాలయం పూర్తయ్యే వరకు గుంటూరు కార్యాలయం నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తామన్నారు. కాగా, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు టీడీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు విజయవాడలోని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నివాసంలో సోమవారం సమావేశమయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు వారి వద్దకు మధ్యవర్తులను పంపి బుజ్జగించి తన వద్దకు తీసుకురావాలని సూచించగా, వారంతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి చంద్రబాబును కలిశారు.

మరిన్ని వార్తలు