పుట్టిన బిడ్డకూ నా గురించి చెప్పండి..

14 Nov, 2018 04:09 IST|Sakshi

పెద్దయ్యాక నాకే ఓటు వేస్తారు!

జీతాలు పెంచాను..నాకు అండగా ఉండాల్సిందే

ఆశా వర్కర్ల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం చంద్రబాబు

జీతాలపై గొప్పలు చెబుతున్నారు గానీ జీవో ఇవ్వట్లేదంటూ సీఎంను నిలదీసిన ఓ ఆశా వర్కర్‌

సాక్షి, అమరావతి బ్యూరో: ‘పుట్టిన బిడ్డకూ నా గురించి చెప్పండి. పెద్దయ్యాక నాకే ఓటు వేస్తారు’ అని సీఎం చంద్రబాబు ఆశా వర్కర్లకు సూచించారు. జీతాలు పెంచినందుకు ప్రతిఫ లంగా తనకు అండగా ఉండాలని కోరారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మంగళవారం ఆశావర్కర్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి తనకు అనుకూలంగా ప్రచారం చేయాలని ఆశా వర్కర్లను ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీమంతాలు, అన్నప్రాసనలు చేయిస్తున్నట్లు తెలిపారు. అంటువ్యాధులను కంట్రోల్‌ చేస్తున్నానని, సాంకేతికతను ఉపయోగించి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. తల్లీ, బిడ్డలను ఆర్యోగంగా ఉంచాల్సిన బాధ్యత ఆశా వర్కర్లదేనని పేర్కొన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చారు. రూ.600 కోట్ల వ్యయంతో 59 ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో 1,200 పడకలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. బీజేపీ సహకరించకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నానని పేర్కొన్నారు. రాజధాని రైతులిచ్చిన భూములను అమ్మి అమరావతిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. 2019 మే నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని వ్యాఖ్యానించారు. 

సీఎంను నిలదీసిన ఆశా వర్కర్‌..
చంద్రబాబు ప్రసంగిస్తుండగానే గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఆశా వర్కర్‌ లేచి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ‘ఆశా వర్కర్ల జీతాలు పెంచానని.. రూ.8,600 అందుతాయని మీరు గొప్పగా చెబుతున్నారు. కానీ అందుకు కావాల్సిన జీవోను ఇప్పటి వరకు ఎందుకు విడుదల చేయలేదు’ అని ప్రశ్నించింది. ‘రూ.3 వేల కనీస వేతనంతోపాటు పనితీరును బట్టి మరో రూ.5,600 సంపాదించవచ్చని మీరు చెబుతున్నారు. కానీ పనితీరుతో సంబంధం లేకుండా మూడు వేల రూపాయలను సీలింగ్‌ పెట్టారు’ అని ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం ప్రకటనలతోనే కాలయాపన చేస్తున్నారు తప్ప మాకు ఎలాంటి అదనపు ప్రయోజనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పరిస్థితిని అర్థం చేసుకున్న వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మైక్‌ తీసేసుకున్నారు. సీలింగ్‌ ఎత్తివేస్తూ త్వరలోనే జీవో విడుదల చేస్తామని చెప్పారు. 

సీఎం ఎదుటే స్పృహ తప్పి పడిపోయిన ఆశా వర్కర్‌
ఆకలితో స్పృహతప్పి పడిపోయిన ఆశా వర్కర్‌కు  భోజనం తినిపిస్తున్న తోటి ఆశా వర్కర్లు 
ఓ వైపు సీఎం ప్రసంగిస్తుండగానే ఆయన ముందు కూర్చున్న ఓ ఆశా వర్కర్‌ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే వైద్యులు చేరుకొని ఆమెను పరీక్షించగా షుగర్‌ లెవల్స్‌ పడిపోయాయని తేలింది. ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని గుర్తించిన వైద్యులు వెంటనే అన్నం తెప్పించి తినిపించారు. అధికారులు భోజన వసతి కల్పించకపోవడం.. కనీసం బయటకు వెళ్లి సొంత ఖర్చుతో తిందామన్నా గేట్లు తెరవకపోవడంతో చాలా మంది ఆశా వర్కర్లు నీరసించి పడిపోయారు. సీఎం సభకు హాజరుకాకపోతే ఉద్యోగాలు తీసివేస్తామంటూ బెదిరించి తీసుకువచ్చారని ఆశా వర్కర్లు వాపోయారు. తమ అవసరాలు తీర్చలేనప్పుడు ప్రభుత్వం ఇలాంటి సభలు నిర్వహించడం ఎందుకని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిడికెడు అన్నం కోసం అష్టకష్టాలు..
సీఎం సభకు వచ్చిన ఆశావర్కర్లు పిడికెడు అన్నం కోసం అష్టకష్టాలు పడ్డారు. తోపులాటల్లో గాయాలపాలయ్యారు. గుక్కెడు నీరు కూడా దొరక్క నీరసించి ఎక్కడికక్కడ పడిపోయారు. వివరాలు.. సీఎం సభ కోసం అన్ని జిల్లాల నుంచి ఆశా వర్కర్లను బలవంతంగా విజయవాడకు తరలించారు. ఉదయం ఆరు గంటలకే స్టేడియం లోపలికి తీసుకెళ్లారు. ఎవరూ బయటకు వెళ్లకుండా గేట్లకు తాళాలు వేసేశారు. ఉదయం 11 గంటలకు సభ మొదలవుతుందని చెప్పగా.. సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు గానీ వేదికపైకి చేరుకోలేదు. ఉదయం నుంచి తినడానికి తిండి కూడా పెట్టకపోవడంతో ఆశావర్కర్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సుమారు ఆరు వేల మందిని తరలించగా.. కేవలం రెండు వేల మందికి మాత్రమే సరిపడా భోజన వసతిని కల్పించడంతో మిగిలిన వారంతా ఆకలితో అలమటించిపోయారు. ఉన్న అరకొర భోజనం ప్యాకెట్లు అందుకోవటానికి చిన్నపాటి యుద్ధాలే చేశారు. ఈ తోపులాటలో ఆరుగురు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి. అన్నం తినటానికి ప్లేట్లు కూడా దొరక్కపోవడంతో చివరకు కిందపడి ఉన్న ప్లాస్టిక్‌ కవర్లపైనే భోజనం చేశారు. 

మరిన్ని వార్తలు