ఏపీని ఉదారంగా ఆదుకోండి

8 Dec, 2018 02:37 IST|Sakshi

     ఏటా కరువు, తుపాన్లు రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి

     రూ. 1,401 కోట్ల కరువు సాయం అందించండి

     రాష్ట్రంలో విపత్తుల గురించి కేంద్రానికి వివరించండి

     కేంద్ర బృందం సమావేశంలో సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: వరుస విపత్తుల వల్ల రాష్ట్రానికి కలిగిన తీవ్ర నష్టం గురించి కేంద్ర ప్రభుత్వానికి వివరించి వీలైనంత ఎక్కువ ఆర్థికసాయం అందించేలా సిఫార్సు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర కరువు బృందానికి విజ్ఞప్తి చేశారు. అటు కరువు, ఇటు తుపాన్లు రాష్ట్రానికి ఏటా తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, అందువల్లే విభజన సమయంలోనే ఆంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా చూడాలని కోరానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు నష్టాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందంతో శుక్రవారం సచివాలయంలో సీఎం భేటీ అయ్యారు.

కేంద్ర బృందాల పర్యటనల్లో ఆయా జిల్లాల్లో వారు పరిశీలించిన అంశాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. కరువు వల్ల వరి, మొక్కజొన్న, జొన్న, శనగ తదితర ఆహార పంటలతోపాటు పొగాకు, పత్తి, మిర్చి తదితర వాణిజ్య పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని కేంద్ర బృంద సభ్యులు తెలిపారు. తాగునీటికి తీవ్ర ఎద్దడి ఉందని గమనించామన్నారు. వైఎస్సార్, కర్నూలు,చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పరిస్థితిని అధికారులు వివరించారు.

నిబంధనలను సడలించాలి
విపత్తు బాధిత రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి రాయితీ చాలా స్వల్పమని సీఎం అన్నారు. ‘‘హెక్టారుకు వరికి కేంద్రం రూ. 13,800 కేంద్రం ఇస్తే, రాష్ట్రం మరో రూ. 1,200 అధికంగా రూ. 15 వేలు ఇస్తోంది. దేశంలో నెలకున్న ప్రస్తుత వ్యవసాయ సంక్షోభ పరిస్థితుల్లో కేంద్రం నిబంధనలను సడలించి రైతుల ఆదాయాలు రెట్టింపు చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండూ సమస్యల సాగుగా మారింది. అతికష్టం మీద తాగునీటిని సరఫరా చేస్తున్నాం. రాష్ట్రం 7 ఏళ్లుగా కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది.

ఈ ఏడాది ఖరీఫ్‌లో 9 జిల్లాల్లో 347 మండలాలను కరవు ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వర్షాభావంవల్ల 13.60 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 16.52 లక్షల చిన్న, సన్నకారు రైతులు నష్టపోయారు. రూ. 1,401.54 కోట్ల సహాయం కోరుతూ కేంద్రానికి నివేదిక పంపాం. కేంద్ర బృందాలు వీటిని సానుభూతితో పరిశీలించి ఏపీకి చేయూత అందించేలా చూడాలి’ అని చంద్రబాబు కోరారు.  సమావేశంలో నీరజా అడిడాన్, శ్రీవాత్సవ, అజయ్‌ కుమార్, అమితవ్‌ చక్రవర్తి, ముఖేష్‌ కుమార్, విక్టర్‌ అమల్‌ రాజ్, రాజీవ్‌ సింఘాల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు