భక్తుల డబ్బునే ఖర్చు పెడతాం

15 Oct, 2018 03:41 IST|Sakshi
సరస్వతీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన బెజవాడ కనకదుర్గమ్మ

దుర్గగుడికి ప్రభుత్వం ఇచ్చేదేం ఉండదు: సీఎం

సాక్షి, అమరావతి బ్యూరో/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా శరన్నవరాత్రులను ప్రభుత్వ పండుగగా ప్రకటించినా ప్రత్యేకంగా నిధులంటూ ఇవ్వమని, భక్తులు ఇచ్చే డబ్బునే దేవస్థానం ఖర్చుపెడుతుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆదివారం విజయవాడ కనకదుర్గమ్మకు ప్రభుత్వం తరఫున కుటుంబ సభ్యులతో కలసి పట్టువస్త్రాలను సమర్పించారు. దసరా ఉత్సవాలను ప్రభుత్వ పండగగా ప్రకటించినా నిధులెందుకు ఇవ్వలేదని విలేకరులు సీఎంను ప్రశ్నించారు. టీటీడీ తరపున అనేక ఉత్సవాలను నిర్వహిస్తున్నామని,ఇప్పుడు దాని ఆదాయం బాగా పెరిగిందని అలాగే ఇక్కడ కూడా పెరిగే అవకాశం ఉందన్నారు.  

గతేడాది మొదటి ఐదు రోజుల్లో 2.97 లక్షల మంది రాగా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 5.27 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. దుర్గమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్రాన్ని చల్లగా చూడాలని, వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పంటలు పండాలని కోరుకున్నానని తెలిపారు. అమ్మవారి దయ వల్ల పోలవరం పూర్తి కాగలదని విశ్వసించారు. వచ్చే మార్చికి దుర్గ గుడి ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. సీఎం వెంట ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్, మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, కలెక్టర్‌ లక్ష్మీకాంతం పాల్గొన్నారు. 

అప్పాల ప్రసాదం బాగుంది  
సరస్వతిదేవి అలంకారంలో కొలువైన దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు. దసరా ఉత్సవాల నుంచి భక్తులకు పంపిణీ చేస్తున్న అప్పాల ప్రసాదాన్ని స్వీకరించి బాగుందని ప్రశంసించారు. దసరా ఉత్సవాలలో ప్రతి భక్తుడికి అప్పాలను అందచేస్తారని, ఉత్సవాల అనంతరం కూడా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని ఈఓ తెలిపారు.
కుటుంబ సమేతంగా దుర్గమ్మకు పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబు 

మరిన్ని వార్తలు