ఐఎండీ కంటే.. నా టెక్నాలజీనే గ్రేట్‌

19 Dec, 2018 02:52 IST|Sakshi

ముఖ్యమంత్రి చంద్రబాబు

కాకినాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, ముమ్మిడివరం/ఐ.పోలవరం: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కంటే తన టెక్నాలజీయే గ్రేట్‌ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇస్రోతో కలిసి ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చానని చెప్పారు. తాను తెచ్చిన అవేర్‌ వ్యవస్థ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందన్నారు. పెథాయ్‌ తుపాను కాకినాడ – ఒంగోలు మధ్య తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేయగా, తాను తెచ్చిన టెక్నాలజీ యానాం – తుని మధ్య అని చెప్పగలిగిందన్నారు. పెథాయ్‌ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కాకినాడ కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఐ.పోలవరం మండలం భైరవపాలెంలోని పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న నిర్వాసితులను పరామర్శించారు.

ఈ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘భవిష్యత్తులో తుపాన్లు ఎప్పుడు వస్తాయి? వాటి తీవ్రత ఎలా ఉండబోతుంది? ఎక్కడ తీరం దాటుతుందో చెప్పడమే కాదు. ఎన్ని చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, ఇళ్లు కూలిపోతాయి? ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఏ మేరకు నష్టం వాటిల్లబోతుందో కూడా చెప్పగలిగే స్థాయిలో టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. కోనసీమలో 22 ఏళ్ల క్రితం వచ్చిన తుపాను మొదలుకొని లైలా, హుద్‌హుద్, ఇటీవల తిత్లీ వరకూ అన్ని భారీ తుపాన్లనూ సాంకేతిక పరిజ్ఞానంతో తాను ఎదుర్కొన్నానన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఏ స్థాయిలో తుపాను వచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు.  

ప్రమాణ స్వీకారానికి హాజరైతే తప్పేంటి?
రాష్ట్రాన్ని తుపాను చుట్టుముట్టిన సమయంలో కాంగ్రెస్‌ సీఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తే తప్పేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. తాను జైపూర్‌ వెళ్లినా తన మనసంతా కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలపైనే ఉందన్నారు. ‘కృష్ణా నదిలో బోటు ప్రమాదం జరిగినప్పుడు అదే జిల్లాలో ఉన్నారు. శ్రీకాకుళంలో తిత్లీ తుపాను వచ్చినప్పుడు పక్కనే విజయనగరం జిల్లాలో ఉన్నారు. అప్పుడు బాధితులను పరామర్శించడానికి వెళ్లని ప్రతిపక్ష నేతలు నన్ను విమర్శించడమా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ప్రత్యేక హోదా కోసం అడగరు, పోరాడరు. విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్‌ప్లాంట్, పెట్రో కెమికల్‌ కారిడార్‌ కోసం మాట్లాడరు. కరువు, తుపాన్లు వస్తే కేంద్రం డబ్బులివ్వకపోయినా పల్లెత్తు మాట అనరు. నన్ను మాత్రం విమర్శిస్తుంటారు. మొన్న హుద్‌హుద్‌.. నిన్న తిత్లీ.. నేడు పెథాయ్‌ తుపాన్లను సమర్థంగా ఎదుర్కొన్నాం. ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా అడ్డుకున్నాం’ అని సీఎం పేర్కొన్నారు. ప్రధాని పదవిపై తనకు ఆశలు లేవని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పట్లో ఆ ఆలోచన కూడా లేదని చెప్పారు.

తుపాను సమయంలో నేలకొరిగిన చెట్లను తక్షణమే తొలగించేందుకు చర్యలు తీసుకున్న యంత్రాంగాన్ని, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, అయితాబత్తుల ఆనందరావు, జెడ్పీ చైర్మన్‌ జ్యోతుల నవీన్‌ కుమార్‌తోపాటు విశాఖ, తూర్పు గోదావరి కలెక్టర్లు ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు