15 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం

15 Dec, 2018 05:01 IST|Sakshi

     ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య

     వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కర్నూలు జిల్లాలో సిమెంట్‌ పరిశ్రమకు భూమిపూజ

     ఈ నెలలో ఓర్వకల్లులో ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభిస్తామని వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి రూ.15,73,172 కోట్ల పెట్టుబడులు తెచ్చే 2,632 పరిశ్రమలను ఆకర్షించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. వీటి ద్వారా 33,03,671 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని వ్యాఖ్యానించారు. ఇందులో రూ.6,30,457 కోట్ల పెట్టుబడులతో 1,695 పరిశ్రమలు ఉత్పత్తి నుంచి అనుమతుల వరకు వివిధ దశలలో ఉన్నాయని, వాటిల్లో 795 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించాయన్నారు. కర్నూలు జిల్లా కొలిమిగుంట్ల గ్రామం కల్వటాల గ్రామంలో ర్యామ్‌కో సిమెంట్స్‌ ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ సిమెంట్‌ పరిశ్రమకు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కొలిమిగుంట్ల మండల రైతులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. భూమిపూజ చేసిన గ్రీన్‌ఫీల్డ్‌ సిమెంట్‌ పరిశ్రమను 14 నెలల్లో పూర్తి చేయాలని యాజమాన్యాన్ని కోరారు. 

ప్రపంచానికే విత్తనాలు అందించబోతున్నాం..
రానున్న రోజులు రాయలసీమవేనని, చిత్తూరులో శ్రీసిటీ, అనంతపురంలో ఆటోమొబైల్‌ పరిశ్రమలు, నగరిలో టెక్స్‌టైల్‌ పార్క్, తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ క్లస్టర్, కర్నూలులో మెగా సీడ్‌ పార్క్, సోలార్‌ పార్క్, ఇప్పుడు సిమెంట్‌ హబ్‌ వచ్చాయని చెప్పారు. త్వరలో కర్నూలు జిల్లాలో ఫార్మా పార్క్, కడపలో ఉక్కు కర్మాగారం రాకతో మొత్తంగా రాయలసీమ జాతకమే మారిపోతుందన్నారు. సీడ్‌ పార్క్‌ ద్వారా కర్నూలు జిల్లా నుంచి ప్రపంచానికి విత్తనాలు అందించబోతున్నామని తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ఈ నెలలోనే ప్రారంభిస్తామన్నారు.

మెడ్‌ టెక్‌ పార్కు ద్వారా వైద్య పరికరాలు తయారుచేసి ప్రపంచానికి అందించబోతున్నామని, అదే విధంగా కర్నూలులో ఫార్మా పార్క్‌ ద్వారా ఔషధ రంగానికి ఈ ప్రాంతాన్ని ముఖ్య చిరునామాగా మారుస్తామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని ఒక యజ్ఞంలా చేస్తుంటే కొంతమంది అదేపనిగా అడ్డు పడాలని చూస్తున్నారని ప్రతిపక్ష పార్టీని విమర్శించారు. ఒకప్పుడు ఏపీకి హోదా ఇవ్వాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో కీలుబొమ్మగా మారి అడ్డం పడుతున్నారని, అలాంటి వ్యక్తిని జగన్, పవన్‌కల్యాణ్‌ ఆకాశానికి ఎత్తేస్తూ తెగ పొగిడేస్తున్నారని ఆరోపించారు. తొలుత చంద్రబాబు కల్వటాల గ్రామంలో రామ్‌కో గ్రూపు రూ.1,500 కోట్లతో నెలకొల్పనున్న గ్రీన్‌ఫీల్డ్‌ సిమెంట్‌ పరిశ్రమకు భూమిపూజ చేశారు.

మరిన్ని వార్తలు