రౌడీషీటర్ల ఫొటోలకు పూజ చేసుకోండి

27 Feb, 2018 08:59 IST|Sakshi
చంద్రబాబు

పోలీసులతో సీఎం చంద్రబాబు వ్యాఖ్య

విశాఖపట్నం సిటీ: ‘‘రౌడీషీటర్ల ఫొటోలు ఆన్‌లైన్‌లో అందుబాటులో లేకపోవడం ఏంటి? ఒక పని చెయ్యండి, అందరి రౌడీ షీటర్ల ఫొటోలను ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోండి..’’ పోలీసులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి.

సోమవారం సాయంత్రం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ సేవలు ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సెంటర్‌ ద్వారా అందుతున్న సేవల వివరాలను కమిషనర్‌ హరినారాయణన్‌ సీఎంకు వివరించారు.

ట్రాఫిక్‌ నియంత్రణ వ్యవస్థ, నగరంలో జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన అత్యాధునిక సీసీ కెమెరాలు, వాటి పనితీరును చెబుతున్న సమయంలో చంద్రబాబు కలగజేసుకొని.. చూడండి.. ఒక వ్యవస్థ ఏర్పాటు చేశామంటే దానివల్ల మరికొన్ని సేవలు ఎలా అందుబాటులోకి తీసుకురావాలా అని ఆలోచించండి. సీసీ కెమెరాల ద్వారా కేవలం రెడ్‌ సిగ్నల్‌ జంపింగ్, చోరీలు చేసే వారిని గుర్తించడం మాత్రమే కాదు, ఇతర సేవలు వచ్చేలా ప్లాన్‌ చెయ్యండి. ఉదాహరణకు రౌడీ షీటర్ల ముఖాల్ని గుర్తుపట్టేలా వ్యవస్థను ఆధునికీకరించండి. దీనికి పోలీస్‌ కమిషనరేట్‌ సాయం తీసుకొండని చెప్పారు.  నగరంలో ఎంత మంది రౌడీ షీటర్లున్నారు అని జాయింట్‌ సీపీ నాగేంద్రకుమార్‌ను ప్రశ్నించారు. 400 మంది ఉన్నారని ఆయన చెప్పగా, వారి ఫొటోలు ఆన్‌లైన్‌లో ఉన్నాయా అని సీఎం అడిగారు. 

ఫొటోలు ఉన్నాయి కానీ.. ఆన్‌లైన్‌లో లేవని నాగేంద్ర చెప్పడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఫొటోలు ఉంచుకొని ఏం చేసుకుంటారు. వారి ఫొటోల్ని తీసుకెళ్లి ఇంట్లో పూజ చేసుకోండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే వాటన్నింటినీ ఆన్‌లైన్‌లో పెట్టాలంటూ ఆదేశించారు. 

మరిన్ని వార్తలు