ఆడవాళ్లలాగా గాజులు తొడుక్కోవాలా!

13 Jan, 2020 04:28 IST|Sakshi
పెదకాకాని వద్ద పోలీసులతో బాబు వాగ్వాదం

పోలీసు అధికారులతో చంద్రబాబు వాగ్వాదం

నరసరావుపేటలో జోలెపట్టి విరాళాల సేకరణ

పెదకాకాని (పొన్నూరు) /నరసరావుపేట: ‘‘మీరు కేసులు పెడుతుంటే ఆడవాళ్ల మాదిరిగా గాజులు తొడుక్కోవాలా? పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతుంటే కేసులు పెడతారా? పోలీసులు పనితీరు మార్చుకోండి’’ అంటూ మాజీ సీఎం చంద్రబాబు పోలీసు అధికారులను హెచ్చరించారు. ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి నరసరావుపేటలో జరిగే కార్యక్రమానికి వెళుతున్న చంద్రబాబు జాతీయ రహదారిపై పెదకాకాని వద్ద బైక్‌ ర్యాలీ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ ర్యాలీకి పోలీసులు అనుమతి లేదన్నారని, తాను ఎక్కిన బైక్‌ తాళం పోలీసులు తీసుకున్నారని తెలియడంతో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు.

బైక్‌ దిగి పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘‘అధికారం తాత్కాలికం, 14 ఏళ్లు పరిపాలించా. మీరు ఆడుకోవాలంటే నాతో ఆడుకోండి.. నాకేం బాధలేదు. మీ పనితీరు కారణంగా సూసైడ్‌ స్క్వాడ్‌లు తయారవుతాయి. 144 సెక్షన్‌ పెట్టవద్దని సుప్రీంకోర్టు వార్నింగ్‌ ఇచ్చింది. ఇక్కడ ఆరు నెలలు 144 సెక్షన్‌ పెట్టిన ప్రభుత్వం సిగ్గుపడాలి’’ అంటూ అక్కడ విధులలో ఉన్న అడిషనల్‌ ఎస్పీ ఈశ్వరరావు, డీఎస్పీ దుర్గాప్రసాద్‌పై మండిపడ్డారు. కాగా, అమరావతి ఉద్యమంలో భాగంగా చంద్రబాబు నరసరావుపేటలో జోలె పట్టి విరాళాలు సేకరించారు. 

మరిన్ని వార్తలు