రాజధానిపై రెఫరెండానికి సిద్ధమా?

5 Feb, 2020 05:03 IST|Sakshi
తెనాలిలో జరిగిన సభలో మాట్లాడుతున్న చంద్రబాబు

మూడు రాజధానులకు ప్రజలు అంగీకరిస్తే మరో మాట మాట్లాడను ప్రతిపక్ష నేత చంద్రబాబు

తెనాలి: రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో కోరుతుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే అమరావతిగా రాజధానిని కొనసాగించడం, మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రజల్లో రెఫరెండం నిర్వహించాలని సవాలు విసిరారు. రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులకు అంగీకరిస్తే, తాను మరొక్కమాట కూడా మాట్లాడనని అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జేఏసీ దీక్షా శిబిరంపై దాడిని ఖండిస్తూ మంగళవారం స్థానిక వీఎస్సార్‌ అండ్‌ ఎన్‌వీఆర్‌ కాలేజీ మైదానంలో నిరసన బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా ప్రసంగించారు. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ 2015లో జీవో జారీ చేశామని, వచ్చే ఏప్రిల్‌కు ఐదేళ్లవుతుందని చెప్పారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సాక్ష్యాధారాలుంటే చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని అన్నారు. 

ఆస్తులమ్మి అభివృద్ధి చేస్తామనడం వినాశనానికే.. 
హుద్‌హుద్‌ తుఫాను తర్వాత విశాఖపట్నం రూపురేఖలు మార్చిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడు విశాఖపట్నంలో 6 వేల ఎకరాల ఎస్సీల భూములను బలవంతంగా లాండ్‌పూలింగ్‌ పేరుతో తీసుకోవాలని చూస్తున్నారని, నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మాలనే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు. ఆస్తులమ్మి ఎవరైనా అభివృద్ధి చేస్తామంటే అది వినాశనానికేనని తేల్చిచెప్పారు. అంతకుముందు సీపీఐ నేత ఎ.రామకృష్ణ మాట్లాడుతూ... నెలాఖరులోగా మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోకపోతే తామంతా ఢిల్లీకి వెళ్లి పోరాడతామని చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతీయ విభేదాలతో ప్రజల్లో చిచ్చు రేపేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని టీడీపీ కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ ఆరోపించారు. తెనాలి సభలో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం, స్వోత్కర్షను జనం భరించలేకపోయారు. చాలామంది మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. 

>
మరిన్ని వార్తలు