సీఎం ‘సొంత’ లాభం!

24 Feb, 2019 03:57 IST|Sakshi

కీలక శాఖల్లో చంద్రబాబు సామాజిక వర్గం అధికారులు

కేంద్ర సర్వీసుల నుంచి రప్పించి మరీ తన వర్గానికే పెద్దపీట

యూనివర్సిటీలన్నింటిలో అదే సామాజిక సూత్రం

రాష్ట్ర ఐఏఎస్‌ కేడర్‌లో ఇతర సీనియర్లకు అప్రాధాన్య పోస్టులు      

సాక్షి, అమరావతి: టీడీపీ పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పలువురిని కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి రప్పించి ప్రాధాన్యం కల్పించారు. రాష్ట్ర ఐఏఎస్‌ కేడర్‌కు చెందిన ఇతర సీనియర్‌ అధికారులను అప్రాధాన్య శాఖలకే పరిమితం చేశారు. అడ్వకేట్‌ జనరల్‌ నుంచి కీలకమైన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌తో సహా సీఎం పేషీలో చంద్రబాబు సామాజిక వర్గం అధికారులకే రెడ్‌ కార్పెట్‌ పరిచారు. ఇండియన్‌ రెవెన్యూ సర్వీసుతోపాటు డిఫెన్స్, పోస్టల్‌ సర్వీసుల్లో పని చేస్తున్న పలువురిని డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకువచ్చి వారికి కీలక బాధ్యతలను అప్పగించారు. 

డిప్యుటేషన్‌పై రప్పించుకుని...
కేంద్ర డిఫెన్స్‌ సర్వీసు నుంచి తీసుకువచ్చిన ఎం.అశోక్‌బాబును సాధారణ పరిపాలన శాఖ ప్రొటోకాల్‌ విభాగం డైరెక్టర్‌గా నియమించారు. ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఎండీగా కె.సాంబశివరావును నియమించారు. ఇండియన్‌ రెవెన్యూ సర్వీసు (ఆదాయపు పన్ను) నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకువచ్చిన వి.కోటేశ్వరమ్మను కనకదుర్గ ఆలయం ఈవోగా నియమించారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సీఈవోగా గంటా సుబ్బారావును నియమించారు. ఇండియన్‌ పోస్టల్‌ సర్వీసు నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకువచ్చి కె.సంధ్యారాణిని పాఠశాల విద్య డైరెక్టర్‌గా నియమించారు. పదవీ విరమణ చేసిన కె.లక్ష్మీనారాయణను ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమించారు. ఏపీ ప్లానింగ్‌ బోర్డు సభ్యుడిగా సీఎం సామాజిక వర్గానికి చెందిన కె. శ్రీనివాసులనాయుడును నియమించారు. వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ సలహాదారుగా జీ.వీ.కృష్ణారావును నియమించారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ఛైర్మన్‌గా సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన ఉదయ భాస్కర్‌ను నియమించారు.

వర్సిటీల్లోనూ అదే తీరు..
పద్మావతి మహిళా యూనివర్శిటీ ఇన్‌ఛార్జి వైస్‌ చాన్సలర్‌గా బి.ఉమ, శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా అనురాధ చౌదరి, తెలుగు యూనివర్శిటీ ఇంచార్జి వైస్‌ చాన్సలర్‌గా దుర్గాభవానిని నియమించారు. తిరుపతి స్విమ్స్‌ యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌గా సీఎం సామాజిక వర్గానికి చెందిన రవి కుమార్‌ను నియమించారు. వెటర్నరీ యూనివర్సిటీలో డీన్‌తో సహా మూడు కీలక పోస్టుల్లోను చంద్రబాబు  సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించారు. వెటర్నరీ వర్సిటీ  కంప్ట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌గా జె.వి. రమణ, వెటర్నరీ యూనివర్సిటీ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌గా రాఘవరావు, వెటర్నరీ వర్సిటీ డీన్‌గా టీఎస్‌. చంద్రశేఖరరావులను నియమించారు. నాగార్జున యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా జి.రోశయ్యను నియమించారు. ఎన్జీరంగా అగ్రికల్చర్‌ వర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా దామోదర నాయుడును నియమించారు. ఇదే వర్సిటీలో డైరెక్టర్‌ రీసెర్చ్‌గా వరదరాజులు నాయుడును నియమించారు.

అగ్రికల్చర్‌ వర్సిటీ డీన్‌గా కృష్ణ ప్రసాద్‌ను, అగ్రికల్చర్‌ వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌గా  ఏ.ఎస్‌.రావును నియమించారు. ఇదే వర్సిటీ ఏడీఆర్‌లుగా ప్రసాద్, సత్యనారాయణలను నియమించారు. శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ రిజిష్ట్రార్‌గా సుధాకర్‌ను నియమించారు. కృష్ణా వర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉమను నియమించారు. అనంతపురం జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌గా కృష్ణారావును నియమించారు. ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌గా పి. నరసింహారావును నియమించారు. వీరందరూ కూడా సీఎం సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం.  ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా సీహెచ్‌.కుటుంబరావును నియమించారు. అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమించారు. 

తరలిపోతున్న ఇతర అధికారులు..
మరోపక్క రాష్ట్ర ఐఏఎస్‌ కేడర్‌కు చెందిన ప్రత్యేక సీఎస్‌ ఎల్‌.వి.ప్రసాద్‌ను ప్రాధాన్యం లేని యువజన సర్వీసులకు కేటాయించారు. మరో సీనియర్‌ అధికారి, ప్రత్యేక సీఎస్‌ జె.ఎస్‌.వి.ప్రసాద్‌ను కూడా ప్రాధాన్యం లేని సహకార శాఖలో నియమించారు. రాష్ట్రంలో సాగుతున్న ఈ వ్యవహారాలను భరించలేక రాష్ట్ర కేడర్‌కు చెందిన పలువురు ఐఏఎస్‌లు కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయారు. లవ్‌ అగర్వాల్, పీ.వీ.రమేశ్, ఎ.గిరిధర్, సుమిత్రా దావ్రా, నీలం సహానీ తదితరులు కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయిన వారిలో ఉన్నారు.

సీఎంవోలో ‘సొంత’ మనుషులు..!
ప్రస్తుతం సెర్ఫ్‌ సీఈవోగా పనిచేస్తున్న కృష్ణమోహన్‌ గతంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. చంద్రబాబు సీఎం కాగానే కృష్ణమోహన్‌ను మళ్లీ సర్వీసులోకి తీసుకుంటూ తొలుత సమాచార శాఖ కమిషనర్‌గా బాధ్యతలను అప్పగించారు. అనంతరం సెర్ఫ్‌ సీఈవోగా నియమించడంతో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా సీఎం సామాజిక వర్గానికే పెద్ద పీట వేశారు. సీఎం ఐటీ సలహాదారుగా జె.ఎ.చౌదరి పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న జి.సాయిప్రసాద్‌ జలవనరులతో పాటు కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌ కేడర్‌కు చెందిన రాజమౌళిని డిప్యుటేషన్‌పై తెచ్చి సీఎం కార్యాలయంలో కీలక బాధ్యతలను అప్పగించారు.

ముఖ్యమంత్రి పీఏలుగా పని చేస్తున్న రాజగోపాల్, శ్రీనివాస్‌ కూడా సీఎం సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. మరోపక్క ఇండియన్‌ రెవెన్యూ సర్వీసుకు చెందిన జాస్తి కృష్ణకిషోర్‌ను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకువచ్చి రాష్ట్ర ఆర్థిక మండలి సీఈవోగా నియమించారు. ప్రవాసాంధ్రుల వ్యవహారాల సలహాదారుగా వేమూరు రవికుమార్‌ను నియమించారు. వేమూరు హరికృష్ణ ప్రసాద్‌ను ఆర్టీజీఎస్‌ సలహాదారుగా నియమించారు. ఇండియన్‌ రెవెన్యూ సర్వీసు నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకువచ్చిన వెంకయ్య చౌదరిని ఏపీ  మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించారు. ఇండియన్‌ ఇన్పర్మేషన్‌ సర్వీసు నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి రప్పించిన ఎస్‌.వెంకటేశ్వర్‌ను సమాచార శాఖ కమిషనర్‌గా నియమించారు. 

మరిన్ని వార్తలు