ట్రాఫిక్‌లో చిక్కుకున్న సీఎం కాన్వాయ్

3 Feb, 2015 03:07 IST|Sakshi
ట్రాఫిక్‌లో చిక్కుకున్న సీఎం కాన్వాయ్

కనకదుర్గమ్మ వారధిపై ఘటన
 సీఎం వాహనం చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు
 ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసు ఉన్నతాధికారులు
 10 నిమిషాల తర్వాత కదిలిన కాన్వాయ్
 ఉన్నతస్థాయి విచారణకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు
 
సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ, గుంటూరు జిల్లా పోలీసుల మధ్య సమన్వయ లోపం కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కాన్వాయ్ సోమవారం రాత్రి కనకదుర్గమ్మ వారధిపై ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. పోలీసు ఉన్నతాధికారులు ట్రాఫిక్ క్లియర్ చేసిన తర్వాత కాన్వాయ్ ముందుకు కదిలింది. సీఎం సోమవారం గుంటూరు పర్యటన ముగించుకుని విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. రాత్రి 8.30 గంటల సమయంలో కాన్వాయ్ గుంటూరు, కృష్ణా జిల్లాలను అనుసంధానిస్తూ కృష్ణా నదిపై ఉన్న కనకదుర్గమ్మ వారధిపైకి రాగానే ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది.

ఆ సమయంలో కాన్వాయ్‌లో 90కిపైగా వీవీఐపీ, వీఐపీ వాహనాలున్నాయి. లారీలు, ఇతర వాహనాల మధ్య కాన్వాయ్ ఇరుక్కుపోయింది. వెంటనే సెక్కూరిటీ సిబ్బంది సీఎం ఉన్న వాహనంతో సహా అన్ని వాహనాల్లో లైట్లు ఆర్పేశారు. సీఎం కారు చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు. కాన్వాయ్‌లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు వెంటనే కిందకు దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దీంతో 10 నిమిషాల తర్వాత కాన్వాయ్ ముందుకు కదిలింది.

సీఎం ప్రయాణించే మార్గంలో విజయవాడ పోలీసులకు సరైన సమాచారం ఇవ్వకుండా గుంటూరు పోలీసులు ట్రాఫిక్‌ను వదిలేశారు. విజయవాడ కమిషనరేట్ పోలీసులు కూడా అప్రమత్తంగా లేకపోవడంతో సీఎం కాన్వాయ్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. దీనిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పోలీసుల నిర్లక్ష్యం, సమన్వయ లోపంపై హోం మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు