చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు

2 Apr, 2019 15:31 IST|Sakshi
మాట్లాడుతున్న కృష్ణారావు

మళ్లీ అవకాశం ఇస్తే రాష్ట్ర పరిస్థితి అథోగతే

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఐవైఆర్‌ కృష్ణారావు ధ్వజం

మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్దాలు కోరు అని.. ఆయన అసత్యాలను సానుకూల మీడియా వక్రీకరించి పదే పదే ప్రచారం చేసి ప్రజలను మభ్యపెడుతోందని విశ్రాంతి ఐఏఎస్‌ అధికారి ఐ.వై.ఆర్‌.కృష్ణారావు ధ్వజమెత్తారు. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సోమవారం జరిగిన బ్రహ్మణ చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర సహాయం చేయలేదని చంద్రబాబు పదేపదే అబద్దాలను చెబుతున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇస్తానంటున్న ప్రత్యేక హోదాపై చంద్రబాబు, రాహుల్‌గాంధీ రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇవ్వాలన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది కేవలం రాష్ట్రానికి ఆర్థిక సహాయంతో కూడిన ప్రత్యేక హోదా మాత్రమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేక హోదాతో పనిలేకుండా రాష్ట్రానికి నిధులు కేటాయించిందన్నారు.

కేంద్ర బడ్జెట్‌ సుమారుగా లక్షన్నర కోట్లు కాగా.. రాష్ట్రానికి లక్ష కోట్లు కావాలని అడగడం ఎంతవరకు సమంజసమన్నారు. కేంద్రం విశాఖకు రైల్వేజోన్‌ ప్రకటించిన 24 గంటల్లో చంద్రబాబు అండ్‌కో మీడియా లేనిపోని అర్థరహిత వ్యాఖ్యానాలు చేసిందన్నారు. ఎక్కడ జోన్‌ ప్రకటించినా తప్పనిసరిగా రిక్రూట్‌మోంట్‌ బోర్డు ఉంటుందని ఇంగిత జ్ఞానం లేకుండా ఆరోపణలు చేశారన్నారు. మాట్లాడితే పోలవరం పాట పాడే బాబు నాలుగన్నరేళ్లు ఎందుకు పట్టించుకోలేదన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బుతో గెలవాలనే తాపత్రయంతో చంద్రబాబు ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడ్డారన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అబద్దాలు చెప్పే చంద్రబాబును గెలిపించే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో విశాఖ తూర్పు బీజేపీ అభ్యర్థి సుహాసినీ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు