అరిస్తే అంతు చూస్తా 

22 Aug, 2019 04:43 IST|Sakshi
వ్యతిరేకత∙వ్యక్తం చేస్తున్న వారిపై అసహనం వ్యక్తం చేస్తున్న చంద్రబాబు

వరద బాధితులపై చంద్రబాబు మండిపాటు 

బాబు తీరుతో జై జగన్‌ అంటూ నినదించిన జనం

కొల్లూరు, భట్టిప్రోలు (వేమూరు): ‘మీ మంత్రులను తీసుకొచ్చి గ్రామాల్లో పనులు చేయించండి. అంతేగాని ఇక్కడ అరిస్తే మీ అంతు చూస్తా.. ఖబడ్దార్‌’ అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరద బాధితులపై మండిపడ్డారు. నాకే ఎదురు చెబుతారా.. అంటూ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. పలు గ్రామాల్లో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కొల్లూరు మండలం పోతార్లంకలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామాల్లోకి రాకుండా పేద వారిని రోడ్డున పడేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇది సరికాదని జనం చెప్పారు.

ప్రజా ప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారని.. భోజనం, మంచి నీరు అందించడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారన్నారు. దీంతో చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘మీరు మాట్లాడొద్దు.. నేను రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు.. పేద ప్రజల తరఫున పోరాడటానికి వచ్చాను.. మీరిలా మాట్లాడితే మీ అంతు చూస్తా.. ఎవరినీ వదిలిపెట్టను.. నా నోరు నొక్కాలని ప్రయత్నిస్తే మంత్రులు, ప్రజా ప్రతినిధులతోపాటు మీ అంతు సైతం చూస్తా’ అంటూ ఊగిపోయారు. దీంతో స్థానికులు జై జగన్‌.. అంటూ నినాదాలు చేశారు.  తిప్పలకట్టలో సమస్యలు చెప్పాలని చంద్రబాబునాయుడు ప్రజలను కోరగా, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలకు ప్రోత్సాహమివ్వడంతో తమకీ దుస్థితి తలెత్తిందని చెప్పారు.

మరిన్ని వార్తలు