కరువు రైతులకు బాబు వంచన

22 May, 2019 03:51 IST|Sakshi

2018 ఖరీఫ్‌ పెట్టుబడి రాయితీ నిధుల మళ్లింపు

కేంద్రం రూ.932 కోట్లు విడుదల చేసినా రైతులకు పైసా విదల్చని వైనం 

2018 ఖరీఫ్‌లో 15.97 లక్షల మందికి రూ.1832 కోట్ల పెండింగు 

2018 రబీ పెట్టుబడి రాయితీ ఊసే లేదు 

గతంలో రూ.2350 కోట్ల బకాయిలు ఎగవేత 

కమీషన్ల కోసం ప్రాజెక్టుల అంచనాలు పెంచి రైతుల పెట్టుబడి రాయితీకి కోత 

బాబు సర్కారు తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

సాక్షి, అమరావతి: విపత్తు బాధిత రైతులకు సీఎం చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. 2018 ఖరీఫ్‌లో కరువు వల్ల పంటలు కోల్పోయి నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను దారి మళ్లించారు. కేంద్ర ప్రభుత్వం రూ.932 కోట్లు విడుదల చేసినా కరువు బాధిత రైతులకు బాబు సర్కారు ఇప్పటి వరకూ నయాపైసా కూడా విదల్చలేదు. 2018 రబీలో కరువు వల్ల పంటలు కోల్పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఊసే లేదు. గతంలో రూ.2,350 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలు అన్నదాతలకు ఇవ్వకుండా చంద్రబాబు ఎగనామం పెట్టారు. తీవ్ర దుర్బిక్షం వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు పశువులకు మేత కూడా అందించలేని దుస్థితిలో అష్టకష్టాలు పడుతున్నారు. చాలామంది బతుకుదెరువు మార్గం కానరాక పొట్ట చేతపట్టుకుని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ తదితర నగరాలకు వలస వెళ్లారు. ఇంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న రైతులకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీని విడుదల చేయడానికి కూడా సర్కారుకు చేతులు రాలేదు. పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తే భారీగా కమీషన్లు వస్తాయి.. రైతులకు ఇస్తే నయాపైసా కూడా రాదనే ఉద్దేశంతోనే బాబు ఇలా చేశారు’ అని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఇది వాస్తవమేనని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.

డ్రాట్‌ మాన్యువల్‌ చెబుతున్నదేమిటి?
పంటలు ఎండిపోయిన రైతులు పెట్టుబడులు కూడా కోల్పోతారు. అప్పు చేసిన వారు రుణ ఊబిలో చిక్కుకుపోతారు. పైర్లు ఎండిపోయి నష్టపోయిన వారు పంటలు వేసుకోవడానికి పెట్టుబడుల్లేక అవస్థలు పడతారు. అందువల్ల తిరిగి పంటలు వేసుకోవడానికి వీలుగా పెట్టుబడి రాయితీ ఇవ్వాలని డ్రాట్‌ మాన్యువల్‌ స్పష్టంగా చెబుతోంది. అందువల్లే కరువు మండలాలను ప్రకటించి నష్టం వివరాలతో సాయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన తర్వాత కేంద్ర బృందం పర్యటించి నష్టాలను అంచనా వేసి నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్రం కరువు సాయం కింద నిధులు విడుదల చేస్తుంది. ఇలా వచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తం జత చేసి బాధిత రైతులను ఆదుకోవాలి. ఇందులో భాగంగానే 2018 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి.. కేంద్రం తన వాటాగా రూ.932 కోట్లు మూడు నెలల క్రితమే విడుదల చేసింది. ఈ నిధులను సర్కారు ఇతర పనులకు బదలాయించి రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2018 రబీలో కూడా రాష్ట్రంలో కరువు తాండవమాడింది. బాబు సర్కారు 257 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. 450  మండలాల్లో కరువు ఉంటే ఇలా కొన్నింటినే కరువు జాబితాలో చేర్చారంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు మరో 90 మండలాలను కరువు జాబితాలో చేర్చాలని ప్రతిపాదనలు పంపించారు. బాబు సర్కారు వీటిని పక్కన పెట్టేసింది. గత ఏడాది రబీలో నష్టపోయిన వారికి పెట్టుబడి రాయితీ అతీగతీ లేదు. 

రైతులంటే ఇంత వివక్షా?
ముడుపులే లక్ష్యంగా బాబు సర్కార్‌ తన అనుకూలురైన పారిశ్రామిక సంస్థల యజమానులకు భారీ రాయితీలు ఇస్తూ రైతుల విషయంలో మాత్రం తీవ్ర వివక్ష చూపింది. ఆరుగాలం కష్టపడే రైతులకు ఇవ్వాల్సిన రూ. 2,350 కోట్ల పెట్టబడి రాయితీ బకాయిలను ఎగవేసింది. ఇది చాలదన్నట్లు రూ. 12,102 కోట్లకు పైగా రైతులకు చెల్లించాల్సిన బిల్లులను పెండింగులో పెట్టేసింది. 2014 ఖరీఫ్‌లో రైతులకు రూ.1,067.77 కోట్ల పెట్టుబడి రాయితీ అందించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించిన తర్వాత దానిని రూ.రూ.692.67 కోట్లకు కుదించి రూ.375 కోట్లు కోత వేసింది. రైతులకు బాబు సర్కారు తీవ్ర అన్యాయం చేసిందనడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏమి కావాలి’ అని రైతుల సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 

2015 –16లో నష్టపోతే...
2015–16లో చిత్తూరు, వైఎస్సార్‌ కడప, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 4,96,890 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. బాధిత రైతులకు ఇవ్వాల్సిన రూ.270 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలను ఇప్పటి వరకూ ఇవ్వలేదు. గత ఏడాది (2018) ఖరీఫ్‌లో కరువువల్ల పంటలు కోల్పోయిన రైతులకు రూ.1,832 కోట్ల పెట్టుబడి రాయితీలో  నయాపైసా కూడా విదల్చలేదు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 932 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడో వచ్చేసింది. 2018 రబీ సీజన్‌లో దుర్భిక్ష బాధిత రైతులకు ప్రభుత్వం మరో రూ.750 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అనధికారిక అంచనా. ఇవన్నీ కలిపితే ప్రస్తుతం రైతులకు చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ మొత్తం రూ. 2852 కోట్లు బాబు సర్కారు ఇవ్వకుండా పెండింగులో పెట్టినట్లు స్పష్టమవుతోంది. 

మరిన్ని వార్తలు