చంద్రబాబే ఈ రాష్ట్రానికి పట్టిన చీడ

8 Feb, 2019 03:35 IST|Sakshi

అప్పుల ఊబిలో నెట్టి రాష్ట్రం దివాలా తీసేలా చేశాడు 

పొద్దున లేచింది మొదలు జగన్‌ నామస్మరణ

 ఢిల్లీ దీక్ష కోసం రూ.1.38 కోట్లు ప్రజాధనం ఖర్చు

 మాజీ మంత్రి బొత్స

సాక్షి, విశాఖపట్నం: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రాష్ట్రానికి గొప్ప ఆస్తి అంటూ తెలుగుదేశం నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు.. ఆయన ఈ రాష్ట్రానికి ఆస్తి కాదు చీడ..చెద’ అని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆదాయం ఏమాత్రం పెరగలేదు కానీ. ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయన్నారు.  2014 వరకు రూ.90 వేల కోట్ల అప్పులు నేడు రూ.2.50 లక్షల కోట్లకు పెరిగాయన్నారు.  ఎన్టీపీసీ తమకు ప్రభుత్వం కట్టాల్సిన రూ.2,130 కోట్లు బకాయిలు కట్టకపోతే రాష్ట్రానికి కరెంట్‌ కట్‌ చేస్తామని ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిందంటే ఇంతకంటే దివాలాకోరుతనం ఇంకేముంటుందని బొత్స ప్రశ్నించారు.

గురువారం విశాఖ సిటీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడైనా ఓ సంక్షేమ పథకానికి అడ్వాన్స్‌ చెక్కులు ఇచ్చిన దాఖలాలున్నాయా? అని అన్నారు. ఉదయం లేచింది మొదలు జగన్‌ నామస్మరణ చేస్తున్నాడే తప్ప రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదన్నారు.  ఓ ప్రతిపక్ష నేతను సంస్కారహీనంగా మాట్లాడడం చూస్తుంటేæ బాబులో అహంకారం, పొగరు, తలబిరుసుతనం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు. ఢిల్లీ దీక్ష కోసం రైళ్లలో జనాల్ని తరలించేందుకు రూ.1.38 కోట్లు రైల్వే శాఖకు కట్టారంటే ప్రజాధనం ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారో అర్థమవుతుందన్నారు. నేతలు గుడివాడ అమర్‌నా«థ్,  మళ్ల విజయప్రసాద్, పలువురు పార్టీ కో–ఆర్డినేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు