అటకెక్కిన అమాత్యుల హామీలు

8 Mar, 2019 11:37 IST|Sakshi
కేంద్రీయ విద్యాలయం కోసం బబ్బేపల్లిలో సేకరించిన భూమి

సాక్షి, మార్టూరు: అధికారం హస్తగతం చేసుకోవడానికి గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అలవికాని హామీలు గుప్పించి గద్దెనెక్కిన సంగతి తెలిసిందే. ఆయనకు ఏమాత్రం తీసిపోకుండా పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు నియోజకవర్గానికి భారీ ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు గత 5 సంవత్సరాలుగా ప్రచార ఆర్భాటాలు చేసిన సంగతి కూడా విదితమే. మార్టూరు మండలంలో మంజూరైనట్లు చెప్పిన ఒక్క పథకం ఆచరణలో ఎక్కడా కనిపించపోవటాన్ని ప్రజలు నిలదీస్తున్నారు.

 నాగరాజుపల్లి ఫుడ్‌పార్క్‌ ఏమైంది ?     
మండల పరిధిలోని నాగరాజుపల్లి గ్రామ కొండ సమీపంలో సర్వే నెంబరు 575 లో ఫుడ్‌పార్కుతో పాటు పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్టు నేతలు 2015లో హడావిడిగా ప్రకటించారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులు 50 ఎకరాల కొండ పోరంబోకును జిల్లా పారిశ్రామిక అభివృద్ధి కేంద్రానికి అప్పట్లోనే అప్పగించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందటంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ ఇందుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేపట్టకపోగా అధికార పార్టీ నేతలు తలా కొంచెం రెవెన్యూ భూమిని ఆక్రమించే పనుల్లో ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

ప్రశ్నార్థకంగా మారిన కేంద్రీయ విద్యాలయం 
మండలంలోని బబ్బేపల్లి గ్రామంలోని కొండ సమీపంలో సర్వే నంబరు 387/11తో 10 ఎకరాల భూమిని సేకరించి 2015వ సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయం స్థాపిస్తున్నట్లు అధికార పార్టీ నేతలు అప్పట్లో హడావిడి చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్వగ్రామం బబ్బేపల్లి. కేంద్రీయ విద్యాలయం కార్యరూపం దాలిస్తే తమ పిల్లలకు నాణ్యమైన విద్య అభ్యసించే అవకాశం దొరుకుతుందని ప్రజలు భావించారు. విద్యాలయం కోసం గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి ఆ భూమిని చదును చేస్తున్నట్లు చెప్పి గ్రావెల్‌ తవ్వి అమ్ముకోవడం గమనార్హం. సంవత్సరాలు గడుస్తున్నా నేతలు చెప్పినట్లు గ్రామంలో కేంద్రీయ విద్యాలయం రాకపోవటంతో స్థానికులు నిరాశ చెందుతున్నారు.

 అతీగతీ లేని వలపర్ల అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి 
మార్టూరు తర్వాత మండలంలో పెద్ద గ్రామమైన వలపర్లకు అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటు చేస్తానని 2017 అక్టోబర్‌లో ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ వలపర్ల పర్యటనలో ప్రకటించారు. గ్రామంలో మంచినీటి ట్యాంకు సమీపంలో కొండ దిగువన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తామని ఏలూరి ప్రకటించారు. ఈ రెండూ నేటికీ కార్యరూపం దాల్చలేదు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, మళ్లీ మీరే రావాలి అంటూ ఫ్లెక్సీల ద్వారా ఆర్భాటం చేస్తున్న శాసనసభ్యుడిని తమకు ఇచ్చిన హామీల మాటేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

శిలాఫలకానికే పరిమితమైన పశువుల హాస్పిటల్‌ 


శిలాఫలకానికే పరిమితమైన బొల్లాపల్లి పశువుల హాస్పిటల్‌
నీరు, పశుగ్రాసం ఎద్దడి ఎదుర్కోవడంతో పాటు పశువుల సంరక్షణ కోసం మండలంలోని బొల్లాపల్లి కొండ సమీపంలో సర్వే నంబరు 525 లో 9.74 ఎకరాల భూమిలో పశువుల వసతి గృహం ప్రారంభిస్తున్నట్లు  22–3–2015 వ తేదిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, శిద్దా రాఘవరావు, శాసన సభ్యుడు ఏలూరి సాంబశివరావు అట్టహాసంగా శంకుస్థాపన కూడా చేశారు. దీంతో వేసవిలో పశుగ్రాసం, నీటికొరత అధిగమించవచ్చని రైతులు, పశుపోషకులు భావించారు. నాటికీ నేటికీ శిలాఫలకం మాత్రమే దర్శనమివ్వటం మినహా ఎలాంటి పురోగతి లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

 అభివృద్ధి శూన్యం
కేంద్రీయ విద్యాలయం గ్రామానికి వస్తుందని సంతోషించాం. విద్యాలయం రాకపోగా కొండ కింద గ్రావెల్‌ స్థానిక నేతలు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆర్భాటపు పస్రంగాలతో, శిలాఫలకాల ప్రారంభాలతో ఐదేళ్లు సరిపుచ్చారు. అభివృద్ధిని మాత్రం మరిచారు.
- దుడ్డు దానయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, బబ్బేపల్లి

పశువుల హాస్పిటల్‌ శిలాఫలకంతో సరి
మా గ్రామంలో పశువుల వసతి గృహం నిర్మిస్తారంటే రైతులంతా సంతోషించారు. శిలాఫలకం వేశాక ఇంతవరకు పురోగతి లేదు. ఇక వస్తుందన్న నమ్మకం పోయింది. పశువులకు హాస్పిటిల్‌ లేకపోవడంతో మేము పడుతున్న ఇబ్బందులు చాలా ఉన్నాయి.
- నార్నె సింగారావు, బొల్లాపల్లి  

>
మరిన్ని వార్తలు