ప్రమాదంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం

16 Aug, 2019 09:54 IST|Sakshi

కరకట్ట వద్ద పెరిగిన ముంపు 

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద పెరుగుతున్న కృష్ణమ్మ ఉధృతి

జలదిగ్బంధంలో చిక్కుకున్న లంక గ్రామాలు

సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది ఉగ్రరూపం దాల్చుతోంది. నాలుగో రోజైన శుక్రవారం కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద 70 గేట్లను ఎత్తివేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు భయం గుప్పిట కాలం వెళ్లదీస్తున్నారు. వరద భారీగా పోటెత్తడంతో ప్రాజెక్టు గేట్లపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో భవాని ఘాట్ ,పుష్కర ఘాట్లు పూర్తిగా నీటమునిగాయి. మరోవైపు నదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన ప్రతిపక్షనేత చంద్రబాబు నివాసంలోనికి వరద చేరడంతో భవనం ప్రమాదంలో చిక్కుకుంది. ఆయన నివాసాన్ని వరద నీరు పూర్తి స్థాయిలో చుట్టుముట్టుతోంది. శుక్రవారం సాయంత్రానికి వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో నివాసంలోని సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని అధికారుల హెచ్చరించారు. వరద లోపలకి రాకుండా నివారించేందుకు భారీ ఎత్తున ఇసుక బస్తాలను సిబ్బంది అడ్డుగా వేస్తున్నారు. అయినా వరద ఉధృతిని అవి కూడా ఆపలేకపోతున్నాయి.

కలెక్టర్‌ పర్యటన..
మరోవైపు గురువారం రాత్రి వరద ఆరు లక్షల క్యూసెక్కులు దాటడంతో రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహమ్మద్ పర్యటిస్తున్నారు. పరీవాహక ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిడంతో భవాని పురంలో ఎస్కేసీవీ చిల్డ్రన్స్ టెస్ట్ ప్రేమవిహార్ రాత్రినుంచి జలదిగ్బంధంలో చిక్కుంది. దానిలోని 100 మందివిద్యార్థులు నిన్నటి నుంచి బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని కలెక్టర్ పర్యవేక్షించారు. సహాయ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. 

వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎప్పటికప్పుడు కలెక్టర్‌తో సమీక్ష నిర్వహిస్తున్నారు. లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుక్కుంటాయని గుర్తించిన అధికారులు గురువారం రాత్రి నుంచే గ్రామాల్లో వారిని ఖాళీ చేయించడం ప్రారంభించారు. అయితే ఆయా గ్రామాల్లోని ప్రజలు స్వతహాగా తమ ఇళ్లు, పశువులను వదిలి పెట్టి రావడానికి ఇష్టపడటం లేదు. అధికారులు  నచ్చచెప్పి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు