వరద నియంత్రణ వల్లే చంద్రబాబు ఇల్లు భద్రం

25 Aug, 2019 04:08 IST|Sakshi

వరదను శాస్త్రీయంగా అంచనా వేసి, ఎగువ

ప్రాజెక్టుల వద్ద నియంత్రించిన అధికార యంత్రాంగం  

అప్రమత్తత వల్లే ముప్పు తప్పిందంటున్న నిపుణులు

లేకుంటే నదీ గర్భంలో నిర్మించినవన్నీ మునిగిపోయేవి

సాక్షి, విజయవాడ: కృష్ణా నదీ గర్భంలో నిర్మించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి నివాసం ప్రభుత్వ అధికార అధికార యంత్రాంగం ముందుచూపుతో శాస్త్రీయంగా వరద నియంత్రణ చేపట్టడం వల్లే నీట మునగకుండా నిలిచిందని నిపుణులు చెబుతున్నారు. వరద ఉధృతి అంచనాలో విఫలమైనా, వరద నియంత్రణ చర్యలు శాస్త్రీయంగా లేకపోయినా చంద్రబాబు ఇల్లు వరదలో మునగడంతో పాటు పులిచింతల రిజర్వాయర్‌ పరిసర గ్రామాలు, ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న లంక గ్రామాలూ పూర్తిగా నీట మునిగేవి. అధికార యంత్రాంగం ముందు చూపుతో చేపట్టిన వరద నియంత్రణ చర్యల వల్లే గండం గడిచిందని నిపుణులు పేర్కొంటున్నారు. 

ప్రకాశం బ్యారేజీ వద్ద గరిష్ట నీటి నిల్వ 3.05 టీఎంసీలు ఉన్నప్పుడు కృష్ణా నదిలో నీటి నిల్వ స్థాయి 17.36 మీటర్లు ఉంటుంది. చంద్రబాబు ఇల్లు 19.5 మీటర్ల ఎత్తులో ఉంది. కృష్ణా నది కరకట్ట 23.5 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీరు అధికంగా రానంత వరకూ కరకట్టపై ఉన్న భవనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇటీవల ఎగువన కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి గరిష్టంగా 8.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. బ్యారేజీ వద్ద 19.35 మీటర్ల ఎత్తుకు జలాలు చేరాయి. బ్యారేజీ నుంచి వెనక్కి వెళ్లే కొద్దీ నీటి నిల్వ ఎత్తు పెరుగుతూ ఉంటుంది.

ప్రకాశం బ్యారేజీ వద్ద 19.35 మీటర్లు ఎత్తుకు చేరినప్పుడు చంద్రబాబు ఇంటి వద్ద 19.99 మీటర్ల ఎత్తుకు నీరు చేరింది. దీంతో ఆయన ఇంటి సెల్లార్‌లోకి, హెలిప్యాడ్‌పైకి నీరు వచ్చింది. 2009లో ప్రకాశం బ్యారేజీకి 10.6 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అప్పట్లో 22 మీటర్ల స్థాయికి నీటి నిల్వ పెరిగింది. ఫలితంగా కరకట్ట అంచు వరకు నీరు చేరింది. అప్పట్లో నదీతీరంలో ఉన్న భవనాలు మొదటి అంతస్తు వరకు వరద నీటిలో మునిగిపోయాయి. లింగమనేని రమేష్‌ భవనం(ఇప్పటి చంద్రబాబు నివాసం) మొదటి అంతస్తు కూడా నీట మునిగింది. అప్పట్లో కొన్ని భవనాలపై ఇరిగేషన్‌ శాఖ ఇంజనీర్లు చేసిన మార్కింగ్‌లు ఇప్పటికీ ఉన్నాయి. 

10 లక్షల క్యూసెక్కులు విడుదల చేసి ఉంటే.. 
ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా వరద నియంత్రణను అధికార యంత్రాంగం శాస్త్రీయంగా చేసింది. ఎగువన ఉన్న ప్రతి ప్రాజెక్టు వద్ద ఎప్పటికప్పుడు నీటి నిల్వ సామర్థ్యం, వరద ఉధృతిని కచ్చితంగా అంచనా వేస్తూ విడుదలపై నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుల భద్రత, దిగువన ముంపు ప్రమాదం, ప్రజల రక్షణ.. ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని నీటి విడుదల చేశారు. పులిచింతల వద్ద 8.50 లక్షల క్యూసెక్కులు కాకుండా 6 లక్షల క్యూసెక్కుల నీటిని తొలుత విడుదల చేశారు. తర్వాత వరద ఉధృతి పెరగడంతో క్రమేణా నీటి విడుదల పరిమాణాన్ని పెంచుకుంటూ పోయారు.

ఈ నెల 17వ తేదీ నాటికి పులిచింతలలో వరద ఉధృతి గరిష్ట స్థాయికి చేరింది. తొలుత వచ్చిన వరద నీటిని దిగువకు విడుదల చేయకుండా పులిచింతలలో నిల్వ చేసి ఉంటే, 17వ తేదీన ప్రకాశం బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి తలెత్తేది. అదే జరిగితే ప్రకాశం బ్యారేజీ వద్ద కరకట్ట వరకూ నీరు చేరేది. నదీ గర్భంలో నిర్మించిన అన్ని భవనాలూ నీట మునిగిపోయేవి. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే పెనుముప్పు తప్పిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు