దగ్గరుండి హత్యలు చేయిస్తున్నారు

12 May, 2015 02:45 IST|Sakshi
అనంతపురం సబ్ జైల్ బయట మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

సీఎంపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్
రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరీ హత్యలు చేయిస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాలనే హత్యాకేంద్రాలుగా మార్చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలుగుదేశంపార్టీ హత్యా రాజకీయాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురం సబ్‌జైల్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పార్టీ నేత చంద్రశేఖర్‌రెడ్డిలతో పాటు పార్టీ కార్యకర్తలను ఆయన సోమవారం పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తహశీల్దార్ కార్యాలయం ధ్వంసం చేశారని రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న గురునాథరెడ్డిపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ నేత ప్రసాదరెడ్డిని అధికారులతో ఫోన్ చేసి పిలిపించి తహసీల్దార్ కార్యాలయంలోనే, పట్టపగలే నరికి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త తెలుసుకుని వచ్చిన గురునాథరెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారని చెప్పారు. నెలరోజుల కిందట సింగిల్ విండో అధ్యక్షుడు విజయభాస్కరరెడ్డి రాజీనామా చేయలేదని కార్యాలయంలోనే కొట్టి చంపారని తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాలను కేంద్రంగా చేసుకుని సాగుతున్న హత్యాకాండను నిలదీయాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. బెంగళూరు నుంచి నేరుగా అనంతపురం చేరుకున్న జగన్ జైలులోని గురునాథరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిలను పరామర్శించిన అనంతరం ప్రసాదరెడ్డి, గురునాథరెడ్డి ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.  కార్యక్రమంలో ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, పార్టీ ప్రోగ్రోమ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అండగా ఉంటా.. అధైర్యపడకండి
అనంతపురం: ‘‘భయపడకండి.. జరిగిన సంఘటనను తలచుకుంటూ బాధపడకండి.. మీరు ధైర్యంగా ఉండండి.. నేను అన్ని విధాలా అండగా ఉంటాన’ంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల హత్యకు గురైన పార్టీ రాప్తాడు మండల నేత భూమిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపారు. ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఉన్న ప్రసాదరెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన భార్య సావిత్రి, కుమారుడు వెంకటరామిరెడ్డి, తమ్ముడు మహానందిరెడ్డిలకు భరోసా ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు