కరచాలనమే బ్రేకింగ్ న్యూస్!

4 Aug, 2014 04:04 IST|Sakshi
కరచాలనమే బ్రేకింగ్ న్యూస్!

* ఇద్దరు సీఎంల కలయికపై వెంకయ్యనాయుడు స్పందన
* అలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో బాబు, కేసీఆర్ ఆలోచించుకోవాలి
* అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచన

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖర్‌రావులు పరస్పరం కరచాలనం చేసుకోవటం పెద్ద వార్త కావటంపై వారిద్దరూ ఆలోచన చేసుకుంటే మంచిదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇద్దరు ముఖ్యమంత్రులు కరచాలనం చేసుకోవడం పెద్ద వార్త కాకూడదు. అయితే అది పెద్ద వార్త అయింది. ఇందుకు దారితీసిన పరిస్థితులపై వారే ఆలోచించాలి. విభేదాలుంటే వాటిని పక్కన పెట్టి కలిసి పనిచేయాలన్నది నా ఆకాంక్ష. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఇద్దరు ముఖ్యమంత్రులకూ సూచించా. పాటిస్తారో లేదో వారి ఇష్టం’ అని చెప్పారు.

దేశ ప్రధాని నరేంద్రమోడీ పలు దేశాల అధ్యక్ష, ప్రధానులతో భేటీ అవడం సాధారణ అంశాలుగానే పరిగణిస్తామన్నారు. విభజన చట్టంలో రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఉద్దేశించిన అంశాల అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఫీజు రీయిం బర్స్‌మెంట్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన 1956 స్థానికత నిబంధనపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకు రానున్నట్లు వెంకయ్యనాయుడు ప్రకటించారు. బిల్డర్ నుంచి ఇళ్లను కొనుగోలు చేసేవారికి ఎక్కువ ప్రయోజనం కలిగించేలా, రియల్ ఎస్టేట్ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేలా బిల్లు ఉంటుందన్నారు. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌తోపాటు కెడ్రాయి లాంటి సంస్థలతోనూ చర్చిస్తున్నట్లు చెప్పారు. వచ్చే శీతకాల సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదానికి వచ్చే అవకాశం ఉందన్నారు.

నిధుల సేకరణపై స్థానిక సంస్థలు దృష్టి పెట్టాలి
పురపాలక సంస్థలు నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంతంగా వనరులు సమకూర్చుకోవటంపై దృష్టి సారించాలని వెంకయ్య సూచించారు. పనులు వసూలు చేసి పారదర్శకంగా ఖర్చు పెట్టాలన్నారు. ఈ విషయాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. స్థానిక సంస్థలకు సుదీర్ఘ కాలం తరువాత కూడా ప్రభుత్వాలు అధికారాలు అప్పగించకపోవటంపై సమీక్షించటం తన ప్రాధాన్యత అంశాలల్లో ఒక్కటని తెలిపారు.

కాలపరిమితి  తీరినందున జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం స్థానంలో కొత్త మిషన్ ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ్హ కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బీమా బిల్లుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలును కోరుతున్నాం. అర్థవంతమైన సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బిల్లుపై చర్చించేందుకు తయారుగా ఉన్నాం. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు నెగ్గేందుకు సహకరించాలి. 2008లో యూపీఏ ప్రభుత్వమే ఈ బిల్లుకు రూపకల్పన చేసింది. తాజా బిల్లులో బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచాం. సవరణ బిల్లులో ఉన్న తేడా అదే.

మరిన్ని వార్తలు