అయినా.. బాబు మారలేదు

3 Jul, 2019 06:51 IST|Sakshi
 రామకుప్పం బహిరంగ సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు

టీడీపీ అధినేత తీరుపై కార్యకర్తల విస్మయం

అభిప్రాయాలను కూడా తెలుసుకోని చంద్రబాబు

ఓటమికి తాను కారణం కాదని చెప్పుకునే ప్రయత్నం 

టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు.. చేతల్లో ఎటువంటి మార్పు కనిపించలేదని ఆ పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ఎన్నికల తరువాత నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా అనేక మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని అధినేతకు తెలియజేయాలని భావించారు. కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినప్టికీ తమ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా.. తాను చెప్పాలనుకున్నది మాత్రం చెబుతున్నారని పెదవి విరుస్తున్నారు. మరో వైపు ఆయన పర్యటనలో ప్రజల నుంచి స్పందన కరువైంది. 

 సాక్షి, తిరుపతి/కుప్పం: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి తాను కారణం కాదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కార్యకర్తలకు చెప్పుకునే ప్రయత్నం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కుప్పానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నియోజకవర్గంలో పర్యటించారు. రెండుచోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఓటమికి రాజకీయ పార్టీ సిద్ధాంతాలే కారణమని చెప్పుకొచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయి కాబట్టే జనం ఓట్లేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంని చేస్తే.. టీడీపీ సిద్ధాంతాలు బాగోలేనట్టే కదా? ఓటమి చెందితే గానీ సిద్ధాంతాలను మార్చుకోవాలని తెలిసిరాలేదా? అని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది.

ఎన్నికల తరువాత నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా అనేకమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని భావించారు. అయితే చంద్రబాబు కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేసినా వారు ఆశించినట్లు మాట్లాడే అవకాశం రాలేదు. చంద్రబాబు చెప్పాలనుకున్నది చెప్పి సమావేశాన్ని ముగించేశారు. ఘోరంగా ఓటమి పాలైనా.. చంద్రబాబు మాత్రం మారలేదనే అభిప్రాయం టీడీపీ శ్రేణులు వ్యక్తం చేశా రు. ఓటమికి కారణాలను విశ్లేషించుకోవాల్సింది పోయి.. ఆ పనిచేస్తే విభేదాలు తలెత్తుతాయనే అభిప్రాయం వ్యక్తం చెయ్యడంపై  కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

కార్యకర్తలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం
కుప్పంలో పర్యటించిన చంద్రబాబు తీవ్ర అసహనంతో కనిపించారు. ఘోర పరాభవం తరువాత పార్టీ శ్రేణులు ఎక్కడ టీడీపీకి దూరమవుతారనే ఆందోళన చంద్రబాబు ప్రసంగంలో స్పష్టమైంది. రామకుప్పం, శాంతిపురం బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాల్లో కార్యకర్తలను ప్రసన్నం చేసేకునే ప్రయత్నం చేశారు. ఎవరైనా తప్పులు చేసి ఉంటే.. వాటిని సరిదిద్దుకుని కలిసికట్టుగా పనిచేద్దాం అంటూ పిలుపునిచ్చారు. కుప్పంలో మెజారిటీ ఎందుకు తగ్గిందని ప్రశ్నిస్తే కారణం తానేనని ఎవరైనా వేలెత్తిచూపిస్తారని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలను పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. మనలో ఎన్ని విభేదాలున్నా మనమే పరిష్కరించుకుని సర్దుకుపోదాం అంటూ ఆయన చేసిన ప్రసంగం ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీ కార్యకర్తలు ఎప్పటికీ టీడీపీకి అండగా ఉండాలని పదే పదే చెప్పుకొచ్చారు. 

స్పందన కరువు
చంద్రబాబు కుప్పం పర్యటనలో స్పందన కరువైంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో బాబు పర్యటన అంటే నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హడావుడి చేసేవారు. అయితే ప్రస్తుతం ఆయన పర్యటన సాదాసీదాగా సాగింది. రామకుప్పం, శాంతిపురం బహిరంగ సభల్లో కార్యకర్తలు ఓ మోస్తారుగా హాజరైనా ప్రజల్లో స్పందన కరువైంది. ఎన్‌టీఆర్‌ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జనం లేక వెలవెలబోయింది. బాబును చూసేందుకు సైతం ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. రోడ్లలో నిలబడి వాహనాలను నిలిపి హారతులిచ్చే మహిళలు కరువవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు