13న ‘భోగాపురం’ సినిమా

12 Feb, 2019 09:48 IST|Sakshi

గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు కోసం నాలుగేళ్లయినా పూర్తికాని భూసేకరణ

ఇంకా పూర్తికాని టెండర్ల ప్రక్రియ

అయినా ఎన్నికల ముందు కొబ్బరికాయ కొట్టడానికి ముఖ్యమంత్రి సన్నద్ధం

సాక్షి, అమరావతి: ఎన్నికల ముంగిట మరో శంకుస్థాపన సినిమాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నద్ధమయ్యారు. భూ సేకరణ పూర్తి కాకుండా, ప్రాజెక్టు ఎవరు నిర్మిస్తారో తెలియకుండానే భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఈ నెల 13వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. టెండర్ల ప్రక్రియ ఫిబ్రవరి 22తో ముగిసిన తర్వాత మార్చి మొదటి వారంలో శంకుస్థాపన తలపెడితే, ఎన్నికల కోడ్‌ వచ్చేస్తుందన్న భయంతో ఫిబ్రవరి 13న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) నుంచి ఆదేశాలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. భూ సేకరణ, టెండర్లు వంటి కీలక పనులు కూడా కాకుండా కేవలం ఎన్నికల ప్ర,చారం కోసమే శంకుస్థాపన చేస్తుండడం గమనార్హం.

టెండర్ల ప్రక్రియపై నీలినీడలు
భోగాపురంలో సుమారు రూ.4,208 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మించాలని 2015లో ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం 2,700 ఎకరాల భూమి అవసరమని అంచనా వేయగా, అందులో ఇంకా 300 ఎకరాలను సేకరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 2016లో టెండర్లు పిలవగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా దక్కించుకుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్లను రద్దు చేసి మెయింటినెన్స్, ఓవర్‌ ఆయిలింగ్‌(ఎంఆర్‌వో)తో కలిపి టెండర్లను పిలిచింది.

తాజా టెండర్లలో ఎయిర్‌పోర్టు నిర్మించడానికి ఏడు సంస్థలు ఆసక్తి చూపించగా, ఈ సంస్థలు ఎంత ఆదాయం ఇస్తాయో తెలపాలంటూ ఫిబ్రవరి 22 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. కానీ, ఇదే సమయంలో భోగాపురం ఎయిర్‌పోర్టు మొదలైన తర్వాత కూడా వైజాగ్‌ ఎయిర్‌పోర్టును కొనసాగిస్తామని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా చెప్పడంతో ఈ టెండర్ల ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 22న ఎంతమంది టెండర్లలో పాల్గొంటారనేది ప్రశ్నార్థకరంగా మారింది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా, ముందుగానే గ్రౌండ్‌ బ్రేకింగ్‌ సెరమనీ పేరుతో కొబ్బరికాయ కొట్టి మరో శిలాఫలకం వేయడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. ఇప్పటికే కడప ఉక్కు, రామాయపట్నం పోర్టులకు ఇదే విధంగా శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు