జగన్, కేసీఆర్‌ మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌

26 Jul, 2019 04:41 IST|Sakshi

ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజం 

నీటి వాటాలు, ప్రాజెక్టుల విషయంలో సీఎం మాట మారుస్తున్నారు

రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెడుతున్నారు 

తెలంగాణకు నీరు ఇవ్వనక్కర్లేదు.. రాయలసీమకు ఇవ్వాలి  

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ల మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఏపీకి డబ్బులు వచ్చాయన్నారు. క్విడ్‌ ప్రో కో ద్వారా డబ్బులు తీసుకున్నందుకు ఇప్పుడు గోదావరి నీటిని వాళ్లకు(తెలంగాణ) ఇస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు గురువారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎవరి వాటా ప్రకారం వాళ్లు నీళ్లు వాడుకుందామంటే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో కేసీఆర్‌ను తిట్టిన జగన్‌ ఇప్పడు పొగుడుతున్నారని విమర్శించారు. నీటి వాటాలు, ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి మాట మారుస్తున్నారని, తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.

తెలంగాణకు నీరు ఇవ్వనక్కర్లేదని, రాయలసీమకు ఇవ్వాలని సూచించారు. ఇది జగన్‌మోహన్‌రెడ్డి సొంత విషయం కాదని, రాష్ట్ర ప్రజల హక్కు అని చెప్పారు. ఏపీ వాడుకోగా మిగిలిన నీటిని తెలంగాణకు ఇస్తే బాగుంటుందన్నారు. కేసీఆర్, జగన్‌ శాశ్వతం కాదని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే శాశ్వతమని స్పష్టం చేశారు. వాళ్లు డబ్బులిచ్చారని నీళ్లిస్తామంటే రైతులు చూస్తూ కూర్చోరని హెచ్చరించారు. ఈ విషయాలను అడుగుతుంటే అసెంబ్లీలో ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదన్నారు. ముఖ్యమంత్రి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, హుందాతనం పాటించాలని హితవు పలికారు. తాను చెన్నారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి వంటి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాని, ఇంత నీచంగా ఎవరూ ప్రవర్తించలేదన్నారు.

వయసులో ఉన్న కుర్రాడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో తమకు నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వడం లేదని, ప్రశ్నిస్తే నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారని మండిపడ్డారు. 13 రోజులుగా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, అధికార పక్ష సభ్యలు తిడుతున్నా తమను సమాధానం చెప్పనివ్వడం లేదని వాపోయారు. నీరు–చెట్టు ద్వారా తాము చరిత్ర సృష్టిస్తే, అందులో అవినీతి జరిగిందని చెబుతున్నారని అన్నారు. అసెంబ్లీ మంచి కార్యక్రమాలకు వేదిక కావాలని, ప్రజల సమస్యలపై చర్చించాలన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్‌ ప్రో కోకు పాల్పడిన వ్యక్తి ఇప్పుడు సత్యవంతుడిలా తమకు నీతులు చెబుతున్నాడని విమర్శించారు. ఈ ప్రభుత్వం ప్రజా ఉద్యమాలు, ఆందోళనలను ఎదుర్కోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. 

గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రబాబు 
రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను ప్రతిపక్ష నేత చంద్రబాబు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌కు  వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహూకరించి శాలువా కప్పారు. తమ పార్టీ నేతలను ఆయనకు పరిచయం చేశారు.   

>
మరిన్ని వార్తలు