చంద్రబాబు పిటిషన్‌పై ముగిసిన వాదనలు

2 Jul, 2019 17:49 IST|Sakshi

సాక్షి, అమరావతి : తనకు జడ్‌ ప్లస్‌ కేటగిరి కింద భద్రత కొనసాగించాలని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు మంగళవారం ముగిశాయి. రాజకీయ కారణాలతో చంద్రబాబుకు భద్రత తగ్గించారని ఆయన తరఫు న్యాయవాది మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదించారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబానికి కూడా భద్రత తగ్గించారని తెలిపారు. వైఎస్‌ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ ఉన్నప్పటికీ 26 మందితో ఆయనకి ప్రభుత్వం భద్రత కల్పించిందని కోర్టుకు వివరించారు.

తామెక్కడా చంద్రబాబుకి భద్రత తగ్గించలేదని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్‌ కోర్టుకు తెలిపారు. ఇవ్వాల్సిన భద్రత కంటే ఎక్కువే ఇస్తున్నామని, మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబుకి 58 మంది భద్రతా సిబ్బందిని మాత్రమే ఇవ్వాల్సి ఉందని, 74 మందిని ఇచ్చామని కోర్టుకి విన్నవించారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. చంద్రబాబుకి ఎంతమందిని ఎక్కడెక్కడ ఏయే పొజిషన్‌లో భద్రత కల్పిస్తున్నారో వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు