తోఫాతో ముస్లింలకు చంద్రబాబు టోపీ

19 Jul, 2015 00:09 IST|Sakshi

 సాలూరు: ముస్లింల పట్ల సీఎం చంద్రబాబుకు నిజమైన ప్రేమ, అభిమానం ఉంటే వారి అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసి ఉండేవారని, అవి లేవు కాబట్టే రంజాన్ పండగకు తోఫా పేరుతో ఉచితంగా సరుకులిచ్చి టోపీ పెడుతున్నారని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర విమర్శించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ముస్లిం పేద అమ్మాయిల వివాహానికి 50 వేల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటివరకు ఎందరికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని మసీదులను బాగు చేయించారో వెల్లడించాలన్నారు. ముస్లింల వ్యాపారాభివృద్ధికి సహకరిస్తామని, రాయితీ రుణాలను అందిస్తామని నమ్మబలికారని, కానీ ఆ దిశగా ఇప్పటివరకు కనీస చర్యలు చేపట్టలేదని దుయ్యబట్టారు.
 
  నిజంగా ముస్లింలపై ప్రేమే ఉంటే పేదరికంతో అల్లాడుతున్న కుటుంబాలను ఆదుకోవాలన్నారు. నిలువ నీడలేని వారికి గృహాలు మంజూరు చేయాలన్నారు. ముస్లింల శ్మశాన వాటికలు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.10 లక్షలను యూత్ రీసోర్స్ సెంటర్ నిర్మాణం కోసం తాను మంజూరు చేశానని గుర్తు చేశారు. భవన నిర్మాణం పూర్తి చేసేందుకు మరో రూ.10 లక్షలు అవసరమవుతాయన్నారు. ఈ నిధులను ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. శ్మశానవాటిక చుట్టూ ప్రహారీ నిర్మాణానికి నిధులు కేటాయించానన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ముస్లింలకు ఏమీ చేయదని అందరికీ తెలుసునన్నారు. అందుకే టీడీపీలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరన్నారు. ముస్లింలు వాస్తవాలను గుర్తించి, టీడీపీ తోఫాలకు మోసపోవద్దని కోరారు. రాజన్నదొర వెంట పాచిపెంట మండల జెడ్పీటీసీ ప్రతినిధి సలాది అప్పలనాయుడు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు