వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్‌ సర్వే

22 Aug, 2018 18:38 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి: ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. 2006 తర్వాత అతిపెద్ద వరదలు వచ్చాయన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 19 మండల్లాలో 45 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయని తెలిపారు. 16 పునరావాస కేంద్రాలు నడుస్తున్నాయని వెల్లడించారు. 6,600 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్ర కాలువ మూలంగా ఎక్కువ నష్టం జరిగింది. ఎర్ర కాలువ ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం. ఆర్‌ అండ్‌ బీ రోడ్లకు 35 కోట్లు కేటాయిస్తాం. రాయలసీమలో కరువు ఉంది. కోస్తాలో వరదలు వచ్చాయి. కవల పిల్లల మాదిరిగా రెండు సమస్యలు ఉన్నాయి. గోదావరి నుంచి ఇప్పటికే 1500 టీఎంసీల జలాలు సముద్రం పాలయ్యాయి. ఆరు జిల్లాలో కరువు ఉంది. పోలవరం కోసం కేంద్రం నుంచి 2600 కోట్లు రావాల్సి ఉంది. వరదల కారణంగా ఉభయ గోదావరి జిల్లాలో 600 కోట్ల నష్టం జరిగింద’ని తెలిపారు.  కాగా, గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉభయ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. లంక గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు