బాబు మళ్లీ మాట తప్పారు

2 Sep, 2014 02:36 IST|Sakshi
బాబు మళ్లీ మాట తప్పారు

డిసెంబర్ 31 వరకే ‘మాఫీ’
సాక్షి, హైదరాబాద్: రైతుల వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి మాట తప్పారు. జూలైలో మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 2014 మార్చి నెలాఖరు వరకు తీసుకున్న అన్ని వ్యవసాయ రుణాలూ మాఫీ పరిధిలోకి వస్తాయని ప్రకటించడం తెలి సిందే. అయితే ఆగస్టు 14వ తేదీన జారీ చేసిన రుణ మాఫీ మార్గదర్శకాల్లో మాత్రం.. గత ఏడాది డిసెంబర్ 31 వరకు తీసుకున్న రుణాలకే మాఫీ వర్తిస్తుందని.. ఆ రుణాలపై ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు అయిన వడ్డీ కూడా మాఫీ పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆ మాటను కూడా మార్చేశారు.
 
  గత ఏడాది డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలకే మాఫీ వర్తిస్తుందని.. రుణాలపై వడ్డీ కూడా 2013 డిసెంబర్ వరకు మాత్ర మే మాఫీ పరిధిలోకి వస్తుందని కొత్తగా ప్రకటించారు. ఈ మేరకు ఆర్థికశాఖ తొలి మార్గదర్శకాల్లో సవరణలు చేస్తూ సోమవారం మరో జీవో జారీ చేసింది. అలాగే డిసెంబర్ వరకు చెల్లించిన రైతులకు కూడా మాఫీ వర్తిస్తుందని తొలి మార్గదర్శకాల్లో పేర్కొన్న ప్రభుత్వం ఇప్పుడు సవరణ మార్గదర్శకాల్లో డిసెంబర్ తరువాత కూడా రుణాలు చెల్లించిన రైతులకు మాఫీ వర్తిస్తుందని పేర్కొంది. జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు తీసుకున్న రుణాలను మాఫీ పరిధిలోకి తేకుండా మార్గదర్శకాలను జారీచేశారు. దీంతో.. జనవరి తర్వాత మార్చి నెలాఖరు వరకూ లక్షలాది మంది రైతాంగం తీసుకున్న దాదాపు రూ. 10,000 కోట్లకుపైగా రుణాలు మాఫీ పరిధిలోకి రాకుండా పోతున్నాయి.
 
  ‘మీరు (రైతులు) బంగారంపై పంట రుణాలు తీసుకోండి.. బాబు అధికారంలోకి రాగానే బంగారం విడిపిస్తార’ంటూ ఆ పార్టీ నాయకులు ప్రతి గ్రామంలో తిరిగి మరీ చెప్పారు. ఇప్పుడు టీడీపీ సర్కారు మాఫీ భారాన్ని తగ్గించుకోవడానికి  ఎన్నికల ముందు చెప్పిన మాటకు కట్టుబడకుండా మాఫీకి లక్షన్నర వరకు మాత్రమే.. అది కూడా ఒక కుటుంబానికి ఎన్ని రుణాలున్నా లక్షన్నర వరకు మాత్రమే మాఫీ అని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు