బాస్టర్డ్‌ అంటారా?

14 Dec, 2019 03:59 IST|Sakshi

దాడి దృశ్యాల వీడియోలు సభలో ప్రదర్శన

హుందాగా వ్యవహరించాలని ప్రతిపక్ష నేతకు సభాపతి సూచన

చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు అప్పగిస్తూ సభ తీర్మానం

మార్షల్స్‌ తమనే అవమానించారంటూ టీడీపీ ప్రత్యారోపణ

సాక్షి, అమరావతి: శాసనసభా ప్రాంగణంలో గురువారం అసెంబ్లీ సిబ్బంది, మార్షల్స్‌పై దౌర్జన్యం ఘటనకు సంబంధించి టీడీపీ సభ్యులు, ఇతరులపై చర్యలు తీసుకునే అధికారాన్ని సభాపతి తమ్మినేని సీతారాంకు అప్పగిస్తూ సభ శుక్రవారం తీర్మానం చేసింది. సభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని వైఎస్సార్‌ సీపీ సభ్యులు జక్కంపూడి రాజా, గొల్ల బాబూరావు, అంబటి రాంబాబు, అప్పలరాజు, వరప్రసాద్‌ బలపరిచారు. ఈ అంశంపై దాదాపు రెండున్నర గంటలకుపైగా తీవ్ర భావోద్వేగాల మధ్య సభలో చర్చ జరిగింది. మార్షల్స్‌ను విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, టీడీపీ సభ్యులు దుర్భాషలాడిన వీడియోలను సభలో పలుమార్లు ప్రదర్శించారు. వాస్తవాలు సభ ముందుంచిన తర్వాతైనా చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌ సీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు.

ఉదయం తొమ్మిది గంటలకు సభ  ప్రారంభం కాగానే స్పీకర్‌ తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టగా మంత్రి పేర్ని నాని ఈ అంశాన్ని ప్రస్తావించారు. విపక్ష ఎమ్మెల్యేలు, సభ్యులు కాని వారు మూకుమ్మడిగా పెద్ద ఎత్తున శాసనసభకు ప్రదర్శనగా వచ్చారని, భద్రతా కారణాల దృష్ట్యా మార్షల్స్‌ ఒక్కొక్క ఎమ్మెల్యేను గుర్తించి పంపే ప్రయత్నం చేయగా అడ్డుకుని దాడికి దిగారని, పిడిగుద్దులు గుద్దారని, అనుచితంగా మాట్లాడారని నాని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సభలో చూపించారు. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల మాదిరిగా వ్యవహరించడంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ దశలో టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుంటూ అవన్నీ నిజం కాదన్నారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన ఆరోపణలు చేయడం మరింత వివాదాస్పదమైంది. వీటిని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ ఆదేశించారు.

మార్షల్‌గా ఉన్నా.. వారి బాధలు తెలుసు: ఆర్థర్‌
విపక్షం తీరు పట్ల వైఎస్సార్‌ సీపీ సభ్యులు కొరుముట్ల శ్రీనివాస్, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆర్థర్, కొడాలి నాని, కన్నబాబు తదితరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తానూ గతంలో మార్షల్‌గా ఉన్నానని, వారి బాధలేంటో తెలుసని, బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తే ఎలా? అని ఆర్థర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన బయట జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పేర్కొనటంపై స్పీకర్‌ స్పందిస్తూ ఇది సభా ప్రాంగణంలోనే జరిగిందని స్పష్టం చేశారు. మంత్రి కన్నబాబు అసెంబ్లీ నిబంధనావళిని చదివి వినిపిస్తూ ప్రదర్శనగా రావడం సరికాదన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని, అసెంబ్లీలోకి వచ్చే ప్రయత్నం చేసిన సభ్యులు కానివారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు.

సభలో వీడియోల ప్రదర్శన
మార్షల్స్‌ తమనే అవమానపరిచారని టీడీపీ సభ్యులు పేర్కొనడంతో గురువారం అసెంబ్లీ గేట్‌ వద్ద జరిగిన ఘటనల వీడియోలను సభలో ప్రదర్శించారు. అందులో చీఫ్‌ మార్షల్‌ను చంద్రబాబు, లోకేష్, టీడీపీ సభ్యులు ‘రాస్కెల్, యూజ్‌లెస్‌ ఫెలో, బా...ర్డ్‌’ అంటూ దూషిస్తున్నట్లుగా ఉంది. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మార్షల్స్‌ పట్ల టీడీపీ తీరును ఖండించారు. టీడీపీ సభ్యులు తాము ఆ మాట అనలేదని అనడంతో సభలో పలుమార్లు ఈ వీడియోలను ప్రదర్శించారు. అసెంబ్లీ గేట్లు కారాగారం మాదిరిగా ఉన్నాయన్న చంద్రబాబు వ్యాఖ్యలపై
మంత్రి బుగ్గన స్పందిస్తూ ‘ఆ గేట్లు ఏర్పాటు చేసింది మీరే కదా’ అని వ్యాఖ్యానించారు.

అంతా చూశారు: స్పీకర్‌ తమ్మినేని
అసెంబ్లీ గేటు వద్ద చోటు చేసుకున్న దృశ్యాలను సభలో అంతా చూశారని, ప్రతిపక్ష నేత చంద్రబాబు వాడిన మాటల్లో అన్‌ పార్లమెంటరీ పదాలు ఉన్నాయని స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని హితవు పలికారు. హుందాగా వ్యవహరించాలని, ఆవేశంలో మాట్లాడితే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. సభ్యులు కానివారు అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డీజీపీని ఆదేశించామన్నారు. సభలో పలువురు టీడీపీ సభ్యులు మాట్లాడిన అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు. అనంతరం మార్షల్స్‌పై విపక్ష సభ్యులు దౌర్జన్యానికి దిగటంపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్‌కి అప్పగిస్తూ సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా