కుప్పానికే నీళ్లివ్వని బాబు!

25 Feb, 2020 12:38 IST|Sakshi
కుప్పం బహిరంగ సభలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు

ఎన్నికల కోసం పారించింది 775 ఎంసీఎఫ్‌టీలే   

12 టీఎంసీల వాటా ఎందుకివ్వలేదో   

నవ్వుకుంటున్న టీడీపీ శ్రేణులు, కుప్పం ప్రజలు  

గాలేరు–నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులు పడకేశాయి

చిత్తూరు, బి.కొత్తకోట: కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు రప్పించానని సోమవారం కుప్పం పర్యటనలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడంపై టీడీపీ శ్రేణులు, ఆ నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల కోసం హడావుడిగా జిల్లాలో కృష్ణా జలాలు పారించిన చంద్రబాబు సొంత నియోజకవర్గానికి చుక్కనీరైనా పారించలేదు. గత ఏడాది జనవరి 21న జిల్లాలోకి ప్రవేశించి కృష్ణా జలాలను ఎన్నికలు జరిగిన ఏప్రిల్‌ 11 వరకు మొక్కుబడిగా పారించి మరుసటి రోజున నిలిపివేశారు. ఈ చర్యతో జిల్లాకు తీరని ద్రోహం చేసిన చంద్రబాబు హంద్రీ–నీవా పూర్తి చేశానని, కుప్పానికి నీటిని రప్పించానని చెప్పి మరోసారి తన నైజం బయటపెట్టుకున్నారని సాక్షా త్తు టీడీపీ నేతలే ఎద్దేవా చేస్తున్నారు.

జనవరి 21 నుంచి ఏప్రిల్‌ 11 వరకు 82 రోజులు నీటిని పారించింది కేవలం 775 ఎంసీఎఫ్‌టీలు. అంటే ఒక టీఎంసీ నీటికి 225 ఎంసీఎఫ్‌టీలు తక్కువ. ఈ నీటిలో 207 కిలోమీటర్ల పుంగనూరు ఉపకాలువ (గడ్డంవారిపల్లె నుంచి బొమ్మరాజుపల్లె వరకు)లో 742.19 ఎంసీఎఫ్‌టీలు, కుప్పం కాలువలో 32.81 ఎంసీఎఫ్‌టీల నీరు పారింది. పలమనేరు నియోజకవర్గంలోని అప్పినపల్లె నుంచి 43వ కిలోమీటరులోని వీ.కోట మండలం నార్నిపల్లె వరకు జలాలు సాగి ఆగిపోయాయి. విశేషమేమంటే కుప్పానికి నీరు తరలిస్తానని పదేపదే ప్రక టించిన చంద్రబాబు మాట తప్పారు. కృష్ణా జలాలు కనీసం కుప్పం నియోజకవర్గాన్ని కూడా తాకలేదు. ఇప్పుడేమో కుప్పానికి నీళ్లిచ్చానని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. జిల్లాకు 12 టీఎంసీల నీటి వాటా పారించాల్సి ఉండగా కనీసం పట్టించుకోని ఆయన ఇప్పుడు గొప్పలు చెప్పడం నవ్వులపాలు చేస్తోంది.

టీజీపీ, జీఎన్‌ఎస్‌ఎస్‌ అంతే
తన హయాంలో ఎన్టీఆర్‌ టీజీపీ, గాలేరు–నగరి ప్రాజెక్టులు పూర్తి చేశామని చంద్రబాబు చెప్పడం మరో విడ్డూరం. సోమశిల ప్రాజెక్టులకు సంబంధించిన సోమశిల–స్వర్ణముఖి లింక్‌ కెనాల్, పెన్నా రివర్‌ స్కీం, సంగం బ్యారేజీ, సోమశిలకు సంబంధించిన పనులు, సిద్దాపురం ఎత్తిపోతలు, పెన్నా డెల్టా పనులకు సంబంధించి చంద్రబాబు హయాంలో 2019 ఏప్రిల్‌ 12 నాటికి రూ.95.21 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. గాలేరు–నగరి ప్రాజెక్టు పనులు రూ.1,200 కోట్లతో 7 ప్యాకేజీల్లో పనులు ప్రారంభిస్తే గత ప్రభుత్వంలో కేవలం రూ.200కోట్ల పనులు జరగ్గా, రూ. 20కోట్ల బిల్లులు పెండింగ్‌ పెట్టారు. తెలుగు గంగ ప్రాజెక్టును రూ.1,184 కోట్లతో టీడీపీ ఆధికారంలోకి రాకముందే చేపట్టారు. 2014 నాటికి ప్రాజెక్టు పనుల కోసం రూ.550 కోట్లు ఖర్చు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014–19 మధ్యకాలంలో చేసిన ఖర్చు కేవలం రూ.150 కోట్లు, ఇందులో పెండింగ్‌ బిల్లులు రూ.10కోట్లు. ప్రాజెక్టుల పనులు పూర్తి కాలేదని వాస్తవ లెక్కలు కళ్లకు కనిపిస్తుండగా ప్రాజెక్టులను తానే పూర్తి చేయించానని ప్రకటించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మరిన్ని వార్తలు