ఇంత మోసమా..!

12 Mar, 2019 12:53 IST|Sakshi
త్రిపురాంతకంలో బ్యాంకుల వద్ద మహిళలు

డ్వాక్రా మహిళలకు టీడీపీ వడ్డీ పోటు

2013లో వడ్డీలేని రుణాలు ఇచ్చిన అప్పటి ప్రభుత్వం

టీడీపీ అధికారంలోకి రాగానే వడ్డీకి పై వడ్డీ వసూలు

స్వయం సహాయక సంఘానికి ఇచ్చే మూలనిధిలోనూ కొందరికే చెక్కులు

ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు

నాగులుప్పలపాడు: మహిళల స్వావలంబన కోసం 2013వ సంవత్సరంలో స్త్రీ నిధి పేరుతో వడ్డీలేని రుణాలు అందజేశారు. నేడు అవే స్త్రీ నిధి రుణాలు డ్వాక్రా సంఘాలకు పెద్ద భారంగా మారాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014వ సంవత్సరంలో అధికారం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2013లో ఇచ్చిన వడ్డీ లేని స్త్రీ నిధి రుణాలకు కూడా పూర్తి స్థాయిలో వడ్డీలు వసూలు చేయాలని అధికారులు, బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు, బ్యాంకర్లు స్త్రీ నిధి రుణాలకు వడ్డీలు చెల్లించాలంటూ ఒత్తిడి పెంచారు.

నాగులుప్పలపాడు మండలంలోనేరూ. 3 కోట్లకు పైగా స్త్రీ నిధి రుణాలు
నాగులుప్పలపాడు మండలంలో మొత్తం 45 గ్రామ సంఘాలకు 1701 మందిని ఎంపిక చేసి రూ. 3,12,14,463 వడ్డీలేని రుణాలు అందజేశారు. అప్పటి నుంచి ప్రతి నెలా వడ్డీలేని రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఆ రుణాలు మొత్తానికి వడ్డీలతో సహా చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. స్త్రీ నిధి ద్వారా నాగులుప్పలపాడు మండలంలోని 45 గ్రామ సంఘాలు మొత్తం ఇప్పటి వరకు రూ. 3,06,291 వడ్డీ చెల్లించాలని అధికారులు చూపిస్తున్నారు. 

అరకొర రుణమాఫీలోనూ మోసం
అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలను నిలువునా ముంచాడు. అధికారం చేపట్టి ఐదేళ్లు పూర్తి కావస్తున్నా  పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా స్వయం సహాయక సంఘానికి ఇచ్చే మూలనిధి పేరుతో బాండ్లు అందజేశారు.  వీటిలో గ్రూపులో పది మంది సభ్యులుంటే అందులో నలుగురో, ఐదు మందికి వచ్చాయని మహిళలు చెప్పారు.   స్వయం సహాయక సంఘానికి ఇచ్చే మూలనిధికి సంబంధించి 2900 మంది మహిళలను అనర్హులుగా చూపించారు. మండలంలోని 1400 డ్వాక్రా గ్రూపులుంటే 90 గ్రూపుల పేర్లు లేకుండానే వచ్చాయి.  చంద్రబాబు నాయుడు ఇంత మోసం చేస్తాడని ఊహించలేని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డ్వాక్రా మహిళల తంటాలు
కందుకూరు రూరల్‌: పసుపు–కుంకుమ రెండో చెక్కు నగదు కోసం డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో క్యూలు కడుతున్నారు. రెండో విడతగా మహిళకు రూ. 3500 చొప్పున గ్రూపులోని పది మందికి కలిపి ఒకే చెక్కు రూ. 35 వేలు ఇచ్చారు. ఆ చెక్కును బ్యాంకుకు తీసుకెళ్లి నగదు ఇవ్వాలని డ్వాక్రా మహిళలు కోరారు. అయితే ఇది మార్చి నెలా ఆర్థిక సంవత్సరం ముగింపు నెల కావడంతో బ్యాంకుల్లో నగదు పూర్తి స్థాయిలో నగదు లేదని కొందరు బ్యాంక్‌ అధికారులు చెబున్నారు. మరికొన్ని బ్యాంకులు ముందు చెక్కులు వేయండి ఆ తర్వాత రెండు, మూడు రోజుల తర్వాత నగదు డ్రా చేసుకోండని చెప్తున్నారని డ్వాక్రా మహిళలు తెలిపారు. కొన్ని గ్రూపులకు సంబంధించిన చెక్కులు ఆన్‌లైన్‌లో జనరేటర్‌ కాలేదని చెప్తున్నారని మహిళలు అంటున్నారు. దీంతో డ్వాక్రా మహిళలు బ్యాంకులు, వెలుగు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికల కోడ్‌ రావడంతో నగదు వస్తాయా.. లేదా అనే అనుమానంతో మహిళలు ఒకే సారి అధిక మొత్తంలో బ్యాంకులకు వస్తున్నారు. మండలంలో మొత్తం 938 డ్వాక్రా గ్రూపులు ఉండగా గ్రూపుకి రూ. 35 వేలు చొప్పున రూ. 3,28,30000 ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే సరికి చెక్కులు చెల్లుతాయా... చెల్లినా నగదు ఇస్తారా ఇవ్వరా అనే అయోమయంలో ఉన్నారు.

బ్యాంకుల వద్ద పడిగాపులు
త్రిపురాంతకం:  త్రిపురాంతకంలోని బ్యాంకుల వద్ద సోమవారం మహిళలు పడిగాపులు కాస్తున్నారు. వెలుగు ద్వారా పసుపు కుంకుమ పథకం పేరుతో ప్రభుత్వం నగదును అందిస్తున్నట్లు ప్రకటించింది. గత నెలరోజులుగా మహిళలందరికీ ఈ నగదు అందకపోవడంపై విమర్శలు ఉన్నాయి. వెలుగు సిబ్బంది మాత్రం మీకు త్వరలో వస్తాయని పొదుపు గ్రూపులకు మాటలు చెబుతున్నారు. దాంతో మహిళలో ఆందోళన వ్యక్తమవుతుంది. కొంత మందికి చెక్కులు వచ్చిన నగదు చేతికి రాలేదు. కొంతమంది పేర్లు వారి జాబితాలలో లేకపోవడం విమర్శలకు దారితీస్తుంది.  ఎన్నికల షెడ్యూల్‌ రావడం, కోడ్‌ అమలులోకి రావడంతో ఇక ఈ మాటలన్ని  కేవలం ఎన్నికల నిమిత్తం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలేనన్న అభిప్రాయం మహిళలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు