చీకటి ‘‘చంద్రుని’’  పగటికల

22 Mar, 2019 12:33 IST|Sakshi

సాక్షి, అమరావతి: ‘కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, ఆంధ్రరాష్ట్రే.. ఒకానొక సుముహూర్తాన సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పటి వరకూ అధికార పీఠానికి దూరంగా ఉన్న చంద్రకాంతుడు వెంటనే ఎన్నికలబరిలో దిగాడు. ఏనాడూ స్వయంప్రకాశంలేని ఈ చంద్రుడు, అరువు బలాన్ని తెచ్చుకున్నాడు, అలవి గాని వాగ్దానాలతో అమాయకులను నమ్మించాడు. చావు తప్పి కన్నులొట్టపోయిన చందాన బొటాబొటీ, అత్తెసరు మార్కులో అధికారపీఠం దక్కించుకున్నాడు.

అంతే..సీన్‌ మారిపోయింది. ‘భువికి తానే అధినాథుడనని’, అంతా తన ప్రయోజకత్వమేనని విర్రవీగాడు. ఇచ్చిన హామీలను అటకెక్కించాడు. ఆ హామీల జ్ఞాపకాలను కూడా వెబ్‌సైట్‌ నుంచి తొలగించాడు. ప్రత్యర్థులను అణచడానికి రెండు ఆయుధాలను చేత ధరించాడు. ఒకటి–అవినీతితో కట్టిన మూటలు, మరొకటి తప్పుడు కేసుల బనాయింపు. పుత్రరత్నం తండ్రికి అన్నిటా బాసటగా నిలిచాడు. అన్ని వర్గాలూ బాధలలో మునిగిపోయాయి. ‘ఏ దేవుజూచి నేడలుగునో, ఏ దిగ్భాగము మీద దాడి చనునో, ఏ ప్రాణులం జంపునో..’ అన్నట్టుచ విర్రవీగిన హిరణ్యకశిపుడు ప్రజలకు గుర్తుకు వచ్చాడు. ఇంకా ఈ అసురుడిని చూస్తే, నరకాసురుడు, రావణాసురుడు కూడా గుర్తుకు వచ్చారు. ఆ రాక్షసులు మాత్రం ‘మాకు వారసుడు వచ్చాడోచ్‌’ అని ఆనందించారు.

అయిదేళ్ల చీకటి పాలన అనంతరం మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. సొంత బాకా పత్రికలు, ఛానళ్ళు ఎంత గట్టిగా బాకాలు ఊదినా, చంద్రుడిని ఏదో భయం ఆవరించింది. విపక్షనేత సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ఆ నేత ప్రసంగాలకు కేరింతలు కొడుతున్నారు. ఆయనలో ఒక ఆత్మీయుడిని చూస్తున్నారు. 

 జాతీయ ఛానళ్ళ సర్వే ఫలితాలు చూస్తే, చంద్రుని కంటికి నిద్ర కరువవుతోంది. ఇక లాభం లేదని వెంటనే పురోహితుడి దగ్గరకు పరుగుతీశాడు.. ‘పంతులూ! నేను తిరిగి సింహాసనం ఎక్కేటట్టు దీవించు. మంత్రాలు గట్టిగా చదువు’ అని ఆదేశించాడు.

‘యతో ధర్మస్తతో జయః’ అని దీవించనా అయ్యా!’ అన్నాడు పురోహితుడు. ‘ఆ దీవెనకు అర్థం ఏమి’టని ఎవరినీ నమ్మని చంద్రుడు అడిగాడు. ‘అయ్యా! రాబోయే కురుపాండవ సంగ్రామంలో తనను దీవించమని సుయోధనుడు కోరినప్పుడు, తల్లి గాంధారి పలికిన పలుకులు ఇవి’ అన్నాడు పురోహితుడు. ‘ఈ పదాలకు అర్థం ఏమిటి?’ చంద్రుడు గద్దించాడు. ‘ఎక్కడ ధర్మం ఉంటుందో, అక్కడే విజయం ఉంటుందని దీని అర్థమయ్యా!’ వివరించాడు పురోహితుడు. ‘వద్దు, అలాంటి దీవెనలు అసలే వద్దు’ అన్నాడు చంద్రుడు తత్తరపడుతూ, చెమట తుడుచుకుంటూ. 

‘అయ్యా, అవినీతిపరులు శంకరగిరిమాన్యాలుచంద పట్టాలని సంకల్పం చెప్పి పూజలు ప్రారంభించనా?’ అన్నాడు పురోహితుడు. మళ్ళీ చంద్రుడు కంగారు పడ్డాడు. ‘అసలే వద్దు, ఇంకోటి చెప్పు..’ అన్నాడు చంద్రుడు.
‘అయ్యా! హత్యారాజకీయాలు చేసేవారు, నిత్యం అసత్యప్రచారాలు చేసేవారు నశించిపోవాలని సంకల్పం చెప్పనా?’ అన్నాడు పురోహితుడు. ‘అలాంటివేమీ వద్దు, నేను సింహాసనం ఎక్కాలని మాత్రమే సంకల్పం చెప్పు’ అన్నాడు చంద్రుడు. ‘సర్వాంతర్యామి భగవంతుని కన్నులు కప్పలేము కదా? పగటి కలలు నెరవేరతాయా?’ అంటూ సన్నగా గొణుక్కున్నాడు పురోహితుడు. ‘ఉదాత్తమైన సంకల్పాలను ఈషణ్మాత్రం సహించలేకపోతున్న ఈ పగటి చంద్రుడి కలను ఎందుకు నెరవేర్చాలో ఆ దేవుడే నిర్ణయించుకోవాలి’ అంటూ నిట్టూర్చాడు.
– వారణాసి సుబ్రహ్మణ్యం 

మరిన్ని వార్తలు