రుణ ఉప‘శయన’ పత్రాలు!

30 Oct, 2017 11:53 IST|Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): రైతుల రుణమాఫీ..అస్తవ్యస్తంగా మారింది. ఈ కార్యక్రమం ప్రభుత్వ ప్రచారానికి తోడ్పడుతున్నా.. అన్నదాతలకు ఎలాంటి చేయూతా ఇవ్వడం లేదు. టీడీపీ ఆధినేత నారా చంద్రబాబు నాయుడు..2014 అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీని తుస్సుమనిపించారు. పట్టుమని పది శాతం మందికి కూడా సంతృప్తికరంగా రుణమాఫీ కాలేదని చెప్పవచ్చు.

 జిల్లాలో రుణమాఫీకి అర్హత కలిగిన రైతులు 5.25 లక్షల మంది ఉన్నారు. అయితే అనేక సార్లు వడపోసి 4,30,824 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. మొదటి విడతలో 4,30,824 మంది రైతులకు రూ.687 కోట్లు, రెండో విడతలో 2,70,110 మంది రైతులకు రూ.251 కోట్లు, మూడో విడతలో 1,30,523 మందికి రూ. 303.9 కోట్లు మాఫీ అవుతోంది. రూ.50వేలు,ఆ లోపు రుణం అయితే ఒకేసారి మాఫీ కావాల్సి ఉంది. ఆపైన అప్పు ఉంటే నాలుగేళ్లలో మాఫీ అవుతుంది. చాలా మందికి మొదటి విడతలో రూ.50వేల లోపు రుణం మాఫీ కాలేదు.  

అర్హత పత్రాలు ఏవీ?
మొదటి విడతలో పూర్తిగా రుణమాఫీ లభించని రైతులకు రెండో విడతలో రైతుసాధికర సంస్థ నుంచి రుణ ఉపశమన అర్హత పత్రాలు రావాల్సి ఉంది. జిల్లాలో 20 వేల మందికి ఈ పత్రాలు రాలేదు. మూడో విడతలో వస్తాయని ఆశతో ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూపాడుబంగ్లా మండలం తంగడంచెలో జరిగిన కార్యక్రమంలో మూడో విడత రుణమాఫీ నిధులను విడుదల చేశారు. ఇప్పటికి 20 రోజులు అయినప్పటికీ జిల్లాలో ఒక్క రైతుకు కూడా మూడో విడత రుణమాఫీ నిధులు బ్యాంకు ఖాతాలకు జమ కాలేదు. మూడో విడత రుణమాఫీ పొందాలంటే రైతులు రెండో విడతలో ఇచ్చిన రుణ ఉపశమన అర్హత పత్రంతోపాటు ఆధార్‌ కార్డు నకళ్లను సంబంధిత బ్యాంకుల్లో ఇవ్వాల్సి ఉంది. ఈ వివరాలను బ్యాంకర్లు రైతుసాధికార సంస్థకు అప్‌లోడ్‌ చేస్తారు. అక్కడి నుంచి రుణమాఫీ నిధులు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయి. రైతులు 15 రోజులుగా బ్యాంకుల్లో రుణ ఉపశమన అర్హత పత్రం, ఆధార్‌ కార్డు నకళ్లు ఇస్తున్నా బ్యాంకర్లు వాటిని రైతు సాధికారసంస్థకు అప్‌లోడ్‌ చేయకుండా పక్కన పెట్టినట్లు సమాచారం.  

నేటి నుంచి ఫిర్యాదుల స్వీకరణ
రైతుల రుణమాఫీకి సంబంధించిన ఫిర్యాదులను సోమవారం నుంచి ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్లలో స్వీకరించనున్నారు. కలెక్టరేట్‌లోని జేడీఏ కార్యాలయం, కర్నూలు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరుల్లోని ఏడీఏ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు