డ్వాక్రా మహిళపై.. ఒత్తిళ్ల కత్తి

16 Jun, 2014 02:55 IST|Sakshi
డ్వాక్రా మహిళపై.. ఒత్తిళ్ల కత్తి

 ఎచ్చెర్ల క్యాంపస్:ఎన్నికల హామీగా టీడీపీ తెరపైకి తెచ్చిన డ్వాక్రా రుణాల మాఫీపై అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో స్వయంశక్తి సంఘాల మహిళల పరిస్థితి ఇరకాటంలో పడింది. టీడీపీ ఇచ్చిన హామీ మేరకు గత మార్చి నుంచి సుమారు నాలుగు నెలలుగా స్వయంశక్తి సంఘాలు రుణ వాయిదాల చెల్లింపు నిలిపివేశాయి. బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకర్లు స్పష్టం చేస్తుండగా, కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు సైతం డ్వాక్రా మహిళల ఇళ్లకు వెళ్లి మరీ రుణ వాయిదాలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో సుమారు 45 వేల స్వయం సహాయక సంఘాలు ఉండగా సుమారు 35,683 సంఘాలు రూ.713 కోట్ల మేరకు రుణాలు తీసుకున్నాయి.
 
 సీనియారిటీని బట్టి ఒక్కో సంఘం రూ. 50 వేల నుంచి రూ. 6 లక్షల వరకు తీసుకున్నాయి. గత నాలుగు నెలలుగా ఈ సంఘాలు వాయిదాలు చెల్లించకపోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. డ్వాక్రా సంఘాలు రెండు రకాల బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తుంటాయి. సభ్యుల పొదుపు రూపంలో నెలనెలా చెల్లించే రూ.30 నుంచి రూ.50 మొత్తాల జమకు ఒక ఖాతా, తీసుకున్న రుణ వాయిదాలు నెలనెలా జమ చేసేందుకు మరో ఖాతా  నిర్వహిస్తుంటాయి. నెలవారీ పొదుపు సొమ్ము చెల్లించకపోతే సంఘం రద్దయ్యే ప్రమాదమున్నందున వాటిని మాత్రం అన్ని సంఘాలు ఠంచనుగా చెల్లిస్తున్నాయి. రుణ వాయిదాల చెల్లింపులు మాత్రం పూర్తిగా నిలిచిపోయాయి.
 
 పెరుగుతున్న ఒత్తిళ్లు
 ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం.. బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో బ్యాంకర్లు రుణాలు చెల్లించాలని సంఘాలపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికితోడు పథకాన్ని పర్యవేక్షిస్తున్న ఇందిర క్రాంతి పథం కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు గ్రామాలకు వెళ్లి రుణ బకాయిలు చెల్లించాలని సంఘాల లీడర్లను కోరుతున్నారు. పనిలో పనిగా ఇంకో సూచన కూడా చేస్తున్నారు. రుణ వాయిదాలను వాయిదాల పాస్ పుస్తకంలో కాకుండా పొదుపు పుస్తకంలో జమ చేయించమంటున్నారు. రుణాలు మాఫీ కాకపోతే పొదుపు ఖాతాలోని ఈ సొమ్మును బ్యాంకులు తీసుకుంటాయని, అలా కాకుండా మాఫీ అమలైతే పొదుపు సంఘాలకే ఆ మొత్తాలు ఉండిపోతాయని బ్యాంకర్ల సూచనగా చెబుతున్నారు.
 
 ఎక్కువ కాలం వాయిదాలు చెల్లించకపోతే ఆర్థిక భారం తప్పదని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో జిల్లా మహిళా సమాఖ్యతోపాటు 38 మండల సమాఖ్యలు, 1101 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. ఈ సంఘాలన్నీ రుణ వాయిదాలు చెల్లించకూడదని నిర్ణయించుకున్నాయి. ఐకేపీ సీఎఫ్‌లు కూడా మొదట వాయిదాలు కట్టొద్దని చెప్పినా.. ఇప్పుడు చెల్లించమంటుండటం చర్చనీయాంశంగా మారింది. ఎచ్చెర్ల మండలంలోని ఫరీదుపేట, కేశవరావుపేట, చిలకపాలెం, ఇబ్రహీంబాద్ తదితర గ్రామాల్లో సీఎఫ్‌లు పొదుపు ఖాతాలో రుణ వాయిదాలు జమ చేయాలని సంఘాల సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లా అంతటా దాదాపు ఇదే పరిస్థితి ఉంది.
 
 వాయిదాలు చెల్లించ మంటున్నారు
 వాయిదాలు కట్టమని సీఎఫ్ ఒత్తిడి తెస్తున్నారు. పొదుపు పుస్తకంలో జమ చేయమని సూచిస్తున్నారు. లేదంటే మొత్తం ఒక్కసారి చెల్లించాల్సి వస్తుందని.. భారం అవుతుందని  భయపెడుతున్నారు. భవిష్యత్తులో రుణం కూడా మంజూరు కాదని హెచ్చరిస్తున్నారు. ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నాం. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి.
                     -ఉర్లాపు పున్నమ్మ, ఫరీదుపేట
 

>
మరిన్ని వార్తలు