రుణమాఫీకి తాళం.. రీషెడ్యూల్ రాగం

13 Jul, 2014 02:49 IST|Sakshi

 శ్రీకాకుళం సిటీ: రుణమాఫీని పక్కన పెట్టి ప్రభుత్వం రీషెడ్యూల్ రాగం అందుకోవడం.. దానికి రిజర్వ్ బ్యాంకు అంగీకరించడం జిల్లా రైతాంగాన్ని తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి గురి చేస్తోంది. రీషెడ్యూల్ చేస్తే కొత్త రుణం లభించినప్పటికీ పాత రుణ బకాయిలు అలాగే ఉండిపోతాయి.. వాటిపై వడ్డీ భారం కూడా రైతులపైనే పడుతుంది. ఇదే రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో సుమారు 6.30 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో సుమారు 4.50 లక్షల మంది బ్యాంకుల ద్వారా రూ.1938 కోట్ల వరకు రుణాలు పొందారు. వీరంతా తమ రుణాలు మాఫీ అవుతాయని ఆశగా ఎదురు చూస్తుండగా టీడీపీ ప్రభుత్వం కొత్త రీషెడ్యూల్ అంటుండటం కుంగదీస్తోంది. ప్రభుత్వ వినతి మేరకు గత ఖరీఫ్‌లో తుపాను, కరువు ప్రభావిత మండలాల్లో రైతులు తీసుకున్న పంట రుణాలు రీషెడ్యూల్ చేయడానికి ఆర్‌బిఐ సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి.
 
  దీని వల్ల ఈ ఖరీఫ్‌లో కొత్త రుణాలు అందనున్నప్పటికీ, రుణమాఫీపై సందిగ్ధత కొనసాగుతోంది. లక్ష రూపాయల లోపు రైతు రుణాలపై వడ్డీ ఉండదు. కానీ వాటిని రీషెడ్యూల్ చేస్తే రుణ బకాయితోపాటు ఆ కాలానికి 14 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై వారు భగ్గుమంటున్నారు. అవసరమైతే రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు రుణమాఫీ విషయంలో రైతులకు దన్నుగా నిలిచేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ముందుకొస్తోంది.
 
 అధికార పార్టీలోనే అసంతృప్తి
 రుణమాఫీపై సర్కారు కప్పదాటు వైఖరి అధికార టీడీపీ శ్రేణులను సైతం అసంతృప్తికి గురి చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల గ్రామాల్లో ప్రజలు నిలదీస్తారని, ప్రజల్లో తిరగలేని పరిస్థితి వస్తుందని పార్టీ కార్యకర్తల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ హామీ ఆచరణ సాధ్యమో కాదో ముందే ఆలోచించి ఉంటే బాగుండేదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించడం వారి ఆందోళనకు దర్పణం పడుతోంది.
 
 రుణమాఫీ చేయాల్సిందే..
 ఇచ్చన మాట ప్రకారం రైతుల రుణాలు మాఫీ చేయాల్సిందే. మాట తప్పి ఇప్పుడు రీషెడ్యూల్ చేస్తామనడం దారుణం. వేలాది మంది సన్న చిన్నకారు రైతులు దీని కోసమే ఎదురు చూస్తున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయవద్దు.
     - సాధు రమణమూర్తి, రైతు, అంబటివానిపేట
 
 ఆందోళన బాట తప్పదు
  రుణమాఫీ హామీతోనే టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం మాఫీ చేస్తే మంచిదే..లేదంటే త్వరలోనే జిల్లాలో ఆందోళన బాట పడతాం. నిరసనలు, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు జరగటం ఖాయం. ఇప్పటికే సమావేశాలు పెట్టాలని నిర్ణయించాం.
 - కొల్లి ఎల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు
 
 రీషెడ్యూల్ సరే..పాత బకాయిలో...
 ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని అధికారమిచ్చాం. అయితే ఇప్పుడు రీషెడ్యూల్ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఆ సంగతి సరే.. మరి పాత బకాయిలు, వడ్డీ భారం మాకు ఇబ్బంది కాదా?
 - శిగిలిపల్లి దుర్యోధనరావు, రైతు, టెక్కలి.
 

>
మరిన్ని వార్తలు