బాబూ... ఎన్నికల హామీలు నేరవేర్చు..

21 Jul, 2014 02:09 IST|Sakshi
బాబూ... ఎన్నికల హామీలు నేరవేర్చు..

 శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు దమ్మూ, ధైర్యం ఉంటే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార దాహంతో ఎన్నికలకు ముందు రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీలు ఇచ్చారని, ఇపుడు రీషెడ్యూల్ అంటున్నారని దుయ్యబట్టారు. రుణమాఫీ అంటే రీషెడ్యూలా అని ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు.
 
 చంద్రబాబు అనైతిక చర్యలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు, భయబ్రాంతులకు గురిచేసి వారు పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా చేస్తున్నారని ఆరోపించారు.  నెల్లూరు జెడ్పీటీసీలను డ్రా వరకూ తెచ్చినా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను వైఎస్సార్ సీపీయే గెలుచుకుందన్నారు. ప్రజాస్వామ్యం బతికి ఉందని, న్యాయం, నీతిని అడ్డుకోలేరనడానికి ఇదొక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. జగన్‌మోహనరెడ్డి రాకతోనే రుతుపవనాలు కూడా జిల్లాకు వచ్చాయని జిల్లావాసులే పేర్కొంటుండడం గమనార్హమన్నారు. బాబు వస్తే జాబు గ్యారెంటీ అని డాబు పలికారని, ఉన్న ఉద్యోగులను ఊడగొడుతున్నారన్నారు. ఎన్‌ఆర్‌ఈజీసీ పనులు నిలుపుదల చేయడం చట్టవిరుద్ధమన్నారు.
 
  వివిధ పనులకు సంబంధించి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన కాంట్రాక్టర్‌ల బిల్లులు నిలుపుదల చేయడం సమంజసంకాదన్నారు. ఎన్నికల కమిషన్‌లో పెద్ద ఎత్తున సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఇచ్చిన హామీలు అమలు సాధ్యాసాధ్యాలపై బేరీజు వేసి ఆమోదించిన తరువాతనే ప్రజలకు వాగ్దానం చేసేలా చూడాల్సిన బాధ్యత  కమిషన్‌పై ఉందన్నారు. బాబు నయవంచకుడని, ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కులేదని ప్రజలే చెబుతున్నారన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే రైతులు, విద్యార్థులు పెద్దఎత్తున ఉద్యమించడం ఖాయమన్నారు.
 

మరిన్ని వార్తలు