మాఫీ మాయేనా?!

22 Jul, 2014 02:27 IST|Sakshi
మాఫీ మాయేనా?!

 (నరసన్నపేట రూరల్):రుణమాఫీ మత్తుమందు జల్లి.. గ్రామీ ణ ప్రజల ఓట్లు కొల్లగొట్టేసిన టీడీపీ అధికారంలోకి వచ్చాక మీనమేషాలు లెక్కిస్తోంది. పూటకో మాట చెబుతూ కాలక్షేపం చేస్తోంది. మాఫీపై ఆశతో రైతులు రుణ బకాయి లు చెల్లించడం మానేశారు. ఇప్పుడు ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాయి. పాత రుణాలు కడితేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఏమీ తేల్చడం లేదు. ఈలోగా పుణ్యకాలం గడిచిపోతోంది. అప్పు పుట్టక.. పంట మదుపులు పెట్టలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. మాఫీమత్తు నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న వారికి.. అదంతా మాయేనని అర్థమవుతోంది. ఏ నలుగురు కలిసినా దీన్నే చర్చించుకుంటూ.. అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ముగ్గురు రైతుల మధ్య జరిగిన అటువంటి సంభాషణ వారి మాటల్లోనే విందాం.కృష్ణమూర్తి: ఏంటి సూరయ్య మావా.. దిగాలుగా కూర్సున్నావు.. ఇంట్లో ఎవరి కైనా బాలేదా ఏంటి?..
 
 సూరయ్య: అదేం లేదల్లుడూ.. ఇప్పుడే సావుకారి దగ్గరికెల్లి వ త్తున్నా.. లేక లేక సినుకులు పడ్డాయి. పంట ఏద్దామంటే సల్లిగవ్వలేదు. ధాన్యం సావుకారిని డబ్బు అడిగితే పొమ్మంటున్నాడు.
 
 రామ్మూర్తి:  అయ్యో.. అలాగా మావా.. పోనీ బ్యాంకోల్లనడగలేకపోయావా..
 సూరయ్య: అదీ అయ్యింది. కిందటేడు మీ అత్త పేరుతో పొలం కాగితాలు పెట్టి లోను వాడాను. అదీ చాలకపోతే ఉన్న కొద్ది బంగారం పద్దు పెట్టి అప్పు తెచ్చాను. తీరా చూస్తే.. వర్షాలు, వరదలొచ్చి పంటంతా పోనాది. మదుపులు కూడా దక్క్డ్డ్డనేదు. ఇప్పుడేమో బ్యాంకోల్లు అప్పు కట్టమని పోరుతున్నారు. పంట  మదుపులకే డబ్బుల్లేక అవస్థ పడుతుంటే ఆల్లకు ఎలా కట్టగలం.. అంటుండగా అప్పారావు అక్కడికి వచ్చి మాటలు కలిపాడు.అప్పారావు: ఏంటీ.. మామాఅల్లుళ్లు తెగ మాట్లాడేసుకుంటున్నారు.
 
 కొత్త బోగట్టా ఏమైనా ఉందేటి?..
 సూరయ్య: కొత్త బోగట్టానా.. కాకరకాయా.. కట్టసుకాలు సెప్పుకుంటున్నాం. అదును దాటిపోతాంది. నాట్లు ఎయ్యాల.. అప్పు పుట్టడం నేదు. ఎలా?.. అని కిందామీదా పడతన్నాం.
 
 అప్పారావు: అదేంటి సూరయ్యా.. మొన్న ఎలచ్చన్లో పెచారానికొచ్చిన చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేత్తామని చెప్పాడు కదా.. అప్పులు అన్నీ తీరిపోతాయి కదా!..
 సూరయ్య: ఆ.. అదే ఆశతో ఆ బాబుకి ఓటేసినాం. సీఎం కాగానే మొదటి సంతకం దీని మీదే సేత్తానన్న పెద్ద మనిసి.. ఇప్పుడేమో పెభుత్వం దగ్గర డబ్బు లేదు.. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందంటున్నా డు. ఓటు దాటినాక గేటు మూసినట్లు.. ఇప్పుడు అదే దో రీసెడ్యూల్ అంటున్నాడు. రుణ మాఫీ లేదంట!..
 అప్పారావు: నువ్వు సెప్పేది నిజమే సుమా.. కమిటీ అంటూ 40 రోజులు దాటించేసినారు. ఇప్పుడు రీ సెడ్యూల్ అంటూ మెలిక పెడతన్నారు. ఇదే జరిగితే వొడ్డీ మీద వొడ్డీ పెరిగి అప్పు మరింతవుతుంది. ఇంకో ఇసయం తెల్సా.. మనం బ్యాంకులో తనకా పెట్టిన పొలం అడంగల్ కాపీలు ఇవ్వరంట.. అవసరానికి భూమి అమ్ముకుందామన్నా అప్పు తీరిందాకా ఇబ్బందే. కృష్ణమూర్తి: ఇయన్నీ తెలుగుదేశపోల్లకు తెలియవా.. నేకపోతే ఏంటి.. అప్పుడో మాట ఇప్పుడో మాట ఎందుకు సెప్పాలా?.. ఇదంతా మాయలాగుంది. మాది ఉమ్మడి కుటంబం. మా తమ్ముడు, పెద్దోడు కూడా అప్పు తీసుకున్నారు. కుటంబానికి ఒక్కరికే రుణమాఫీ చేస్తామంటే మా పరిస్థితి ఏటి. ఎలచ్చన్ల ముందే ఈ మాట సెబితే బాగున్ను. తీర్పు మరోలా ఉండేది..
 

మరిన్ని వార్తలు