రుణమాఫీ.. రైతులకు నో హ్యాపీ

19 Aug, 2014 02:03 IST|Sakshi
రుణమాఫీ.. రైతులకు నో హ్యాపీ

 తాళ్లపూడి : రుణమాఫీపై ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా పంటలకు పెట్టుబడి పెట్టేందుకు రుణాలు అందేదారి లేక నానాపాట్లు పడుతున్నారు. బ్యాంకుల్లో తీసుకున్న పాత రుణాలు మాఫీ అవుతాయో లేదో తెలియక అన్నదాతలు అయోమయంలో ఉన్నారు. కుటుంబానికి లక్షన్నర మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో రుణాల మాఫీపై బ్యాంకులకు ఎటువంటి హామీ ఇవ్వడం లేదు. దీంతో బ్యాంకులు, సొసైటీలు రుణాలు చెల్లించాలంటూ రైతులకు నోటీసులు జారీ చేస్తూనే ఉన్నాయి.
 
 సొసైటీల నుంచి రైతులకు నోటీసులు
 వ్యవసాయ రుణాలు 2013-14 ఏడాదికి గడువు తేదీ జూన్ 30తో ముగిసింది. దీంతో బ్యాంకులు రైతులు తీసుకున్న రుణాలు రాబట్టేందుకు చర్యలు ప్రారంభించాయి. గడువు ముగియడంతో రైతులకు 13 శాతం వరకు అదనంగా వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. పాత రుణం చెల్లించే వరకు కొత్త రుణాలు ఇవ్వలేమని ఇప్పటికే స్పష్టం చేశాయి. ప్రభుత్వం, ఆర్‌బీఐ నుంచి రుణాలు మాఫీ విషయంలో ఎటువంటి ఆదేశాలు తమకు రాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. తాళ్లపూడి మండలంలోని ప్రక్కిలంక ఎస్‌బీఐ అధికారులు బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలకు రైతులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా రైతుల పంట రుణాలు, డ్వాక్రా రుణాలు వెంటనే చెల్లించాలని, లేకుంటే చర్యలు తప్పవని ఆటో ద్వారా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తోంది.
 
 జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడు సొసైటీలూ బ్యాంకుల దారిలోనే నడుస్తున్నాయి. అన్నదేవరపేట, మలకపల్లి సహకార సంఘాలు బంగారు రుణాలు తీసుకున్న రైతులకు నోటీసులు జారీ చేశాయి. అన్నదేవరపేట సొసైటీలో 2012-2014 వరకు బంగారంపై 500 మంది రైతులు రూ.1.50 కోట్లు రుణాలు తీసుకున్నారు. పంట రుణాలు 1,200 మంది రూ.6 కోట్లు వరకు తీసుకున్నారు. బంగారంపై రుణాలు తీసుకున్న వారిలో వంద మందికి నోటీసులు ఇచ్చారు. మలకపల్లి సొసైటీ నుంచి, ప్రక్కిలంక ఎస్‌బీఐ నుంచి 2011-12లో బంగారంపై 611 మంది రైతులకు రూ.4.11 కోట్లు, 2012-13లో 511 మందికి రూ.3.19 కోట్లు, 2012-13లో పంట రుణాలు కింద 431 మంది రూ.2.67 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. బంగారంపై తీసుకున్న రుణాలకు నోటీసులు జారీ చేశారు. ఇతర సొసైటీలూ రైతులకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం రుణమాఫీపై బ్యాంకులకు,
 
 సొసైటీలకు స్పష్టంగా ఆదేశాలివ్వాలని రైతులు
 కోరుతున్నారు.
 
 సొసైటీ నుంచి నోటీసు పంపించారు అన్నదేవరపేట సొసైటీలో
 రెండు దఫాలుగా బంగారంపై రూ.72 వేలు, రూ.19,200  పంట రుణం తీసుకున్నాను. రుణాలు చెల్లించాలని నోటీసు పంపించారు. ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో రుణం చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
     - నార్ని వెంకన్నబాబు, రైతు, అన్నదేవరపేట
 
 రుణం చెల్లించాలంటూ ఒత్తిడి
 ప్రక్కిలంక ఎస్‌బీఐలో రూ.20 వేలు కౌలు రైతు కార్డుపై రుణం తీసుకున్నాను. బ్యాంకు నుంచి నోటీసు వచ్చింది. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాం. బ్యాంకు నుంచి మాత్రం నోటీసులు ఇచ్చి రుణం చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు.
     - లింగంపల్లి వీరవెంకటరావు,
     రైతు, అన్నదేవరపేట
 
 బ్యాంకుల నుంచి ఒత్తిడి  రాకుండా చూడాలి
 రైతులు తీసుకున్న రుణాల విషయంలో బ్యాంకుల నుంచి ఒత్తిడి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రుణమాఫీ అమలుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టంగా బ్యాంకులకు, సొసైటీలకు మర్గదర్శకాలను విడుదల చేసి రుణ ఒత్తిడి లేకుండా చేయాలి.
 - కె.సూర్యనారాయణ,
 రైతు, అన్నదేవరపేట

 

మరిన్ని వార్తలు