రైతులు, డ్వాక్రా మహిళలను మోసగించిన బాబు

21 Sep, 2014 01:11 IST|Sakshi
రైతులు, డ్వాక్రా మహిళలను మోసగించిన బాబు

 తణుకు అర్బన్ : టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా రుణాల మాఫీని అమలు చేయకుండా చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకులో శనివారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్దెనెక్కగానే రుణమాఫీలపై తొలి సంతకం అన్న పెద్దమనిషి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా రోజుకో ప్రకటనతో మభ్యపెడుతూ మోసగిస్తున్నారన్నారు. నిరుద్యోగ భృతి, ఇంటింటా ఉద్యోగాలు, బాబు వస్తే జాబు అని ప్రచారాలు చేసుకున్న వారికి ఇప్పుడు ప్రజల కష్టాలు కనిపించడంలేదా అని నిలదీశారు.
 
 తణుకు నియోజకవర్గంలో గతంలో మంజూరైన అభివృద్ధి పనులను సైతం రద్దు చేయించిన ఘనత ప్రస్తుత ప్రజాప్రతినిధికే దక్కుతుందన్నారు. గడచిన నాలుగు నెలల కాలంలో నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు. తాను చేసిన పనులకే ప్రస్తుత నాయకులు రిబ్బన్లు కట్ చేసి ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తన ఇంటి భవన నిర్మాణాన్ని నిబంధనల మేరకే నిర్మించుకున్నట్టు కారుమూరి చెప్పారు. వెంకటరాయపురంలోని ఆంధ్రాసుగర్స్‌లోని ఆస్ప్రిన్ మందుల కంపెనీ వల్ల కాలుష్యం పెరిగిపోతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నా విస్తరణకు స్థానిక ఎమ్మెల్యే కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. కాలుష్య నివారణ మండలి ప్రజాభిప్రాయసేకరణ చేయాలంటే ముప్పు ఉన్న గ్రామాల్లో చేయాలి కాని ఆ సంస్థ ఆవరణలో కాదన్నారు. కేవలం ఒక కుటుంబం కోసం ఏర్పాటవుతున్న ఈ మందుల కంపెనీ వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడతారన్నారు.
 

మరిన్ని వార్తలు