గింజలు లేని ఎసరేనా?

1 Sep, 2014 00:37 IST|Sakshi
గింజలు లేని ఎసరేనా?

 సాక్షి, రాజమండ్రి : ‘రుణాలు కట్టొదు. రద్దు చేస్తామని హామీ ఇచ్చి మా కొంపలు ముంచారు. మాఫీ ఎలా అమలవుతుందో నేటికీ అయోమయమే. కానీ బ్యాంకోళ్లు మాత్రం బకాయిలు కట్టక పోతే గ్రూపులకు ఇంక ముందు లోను ఇచ్చేది లేదంటున్నారు. వడ్డీలతో బకాయిలు కట్టాలంటే మా తలతాకట్టు పెట్టినా చాలదు’ రెండు రోజులుగా జిల్లాలోని డ్వాక్రా మహిళల ఆక్రోశం ఇది. ‘లేని పోని ఆశలు కల్పించారు. అమలు మాత్రం అరకొరగా చేస్తున్నారు. ఇదంతా అధికారం చేసి ఆడిన నాటకం, నమ్మకద్రోహం!’ ఆ మహిళల ఆగ్రహం ఇది. బ్యాంకు అధికారులు డ్వాక్రా సంఘాల వద్దకు వెళ్లి బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తుండడంతో మహిళలు ఆందోళనకు గురవుతున్నారు.
 
 జిల్లాలో సుమారు 30 వేల మహిళా సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 5,900 సంఘాలకు సుమారు రూ.190 కోట్ల మేర వివిధ బ్యాంకుల నుంచి రుణాలు అందాయి. వీరి పరిస్థితి తాజా పరిణామాల నేపథ్యంలో అయోమయంలో పడింది. బ్యాంకు అధికారులు రెండు రోజులుగా మున్సిపాలిటీల్లోని వార్డుల్లో, గ్రామాల్లో తిరుగుతూ సర్పంచ్‌లు, వార్డు సభ్యులతోకలిసి సమావేశాలు పెడుతున్నారు. ఆ ప్రాంతంలో ఉండే డ్వాక్రా సంఘాల బకాయిల చిట్టాలు చూపిస్తున్నారు. చెల్లించాల్సిన అప్పు ఎంత, అందుకు గాను చెల్లించాల్సిన వడ్డీ ఎంత, వడ్డీ, అసలు కలిపితే ఎంత అంటూ లెక్కలు చెబుతున్నారు. ‘మీరు ఈ నెల అంటే సెప్టెంబర్ మొదటి వారంలో పాత బాకీని వడ్డీతో సహా చెల్లించాలి. లేదంటే గ్రూపు గుర్తింపు రద్దు చేస్తా’మని హెచ్చరిస్తున్నారు. ‘ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటించింది కదా’ అంటే మాఫీ ప్రకటించినా అప్పులు కట్టాల్సిందేనంటున్నారు. ‘ప్రభుత్వం మాఫీ చెల్లింపులు ప్రారంభిస్తే అప్పుడు చూద్దాం. ముందు బకాయిలు కట్టాల్సిందే’ అని హుకుం జారీ చేస్తున్నారు.
 
 భారం చెంబుడయ్యాక చెంచాడు మాఫీ!
 రాజమండ్రి అర్బన్‌లోని లలితా మహిళా సంక్షేమ సంఘంలో 20 మంది సభ్యులు బ్యాంకు నుంచి రూ.మూడు లక్షల రుణం తీసుకున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు మాఫీ వాగ్దానం చేయడంతో అప్పటి నుంచీ రుణవాయిదాలు కట్టడం మానేశారు. ఇప్పుడు మూడు నెలలు బకాయి పడడంతో నెల వాయిదా రూ.15 వేల చొప్పున రూ.45 వేలు; నెలకు రూ.5 వేల వడ్డీ చొప్పున రూ.15 వేలు.. మొత్తం రూ.60 వేలు కట్టాలని బ్యాంకు అధికారులు లెక్క చెబుతున్నారు. బకాయి పడ్డందుకు పావలా వడ్డీ వర్తించదని, పూర్తి వడ్డీ చెల్లించాల్సిందేనని ఖండితంగా చెప్పడంతో సభ్యులు అవాక్కయ్యారు. మాఫీతో రుణభారం విరగడవుతుందని ఆశపడ్డ ఈ మహిళలు ఇప్పుడు.. మొదటికే మోసం వస్తుందేమో అని భయపడుతున్నారు. తమను డిఫాల్టర్లుగా చిత్రీకరించి రుణమాఫీకి అనర్హులుగా ప్రకటిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ బకాయిలు, వడ్డీల భారం చెంబుడు అయ్యాక.. చెంచాడు మాఫీ సాయం అందించి సర్కారు తమను వెర్రివాళ్లను చేస్తుందేమోనని దిగాలు పడుతున్నారు.
 

మరిన్ని వార్తలు