బాబు చాంబర్ ఆధునీకరణ ఖర్చు 10 కోట్లు

7 Jul, 2014 02:24 IST|Sakshi
బాబు చాంబర్ ఆధునీకరణ ఖర్చు 10 కోట్లు

* బాబు కోసం భలే హంగు
* ముఖ్యమంత్రి చాంబర్ ఆధునీకరణ ఖర్చు రూ. 10 కోట్లు
* సచివాలయం ఎల్ బ్లాకు 8వ అంతస్తులో ఆర్భాటంగా ఏర్పాట్లు
* ఇంతకుముందు హెచ్ బ్లాక్‌లో చాంబర్‌కు రూ. 3 కోట్ల వ్యయం
* వాస్తు పేరుతో బాబు నిరాకరించటంతో ఆ సొమ్మంతా వృథా
* రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పొదుపు చేయాలని పిలుపు.. ఆర్భాటాలపై భారీ వ్యయం
 
 సాక్షి, హైదరాబాద్:
‘రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. కొత్త రాజధాని నిర్మాణానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలి.. ప్రభుత్వ ఉద్యోగులు పొదుపు పాటించాలి...’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార పగ్గాలు స్వీకరిస్తూనే ఇచ్చిన పిలుపు ఇది! మరి స్వయానా ముఖ్యమంత్రే పాటిస్తున్న పొదుపు తీరును చూస్తే.. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి! ‘సాధ్యమైనంత త్వరగా మన రాష్ట్రానికి వెళ్లిపోదాం...’ అని చెప్తున్న చంద్రబాబునాయుడు.. తాత్కాలిక రాజధాని హైదరాబాద్‌లోని సచివాలయంలో తన చాంబర్ ఆధునీకరణ కోసం కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చుచేస్తున్నారు మరి!!
 
 తొమ్మిదేళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటానికి ఒక్క రోజు కోసం రూ. 30 కోట్లు ఖర్చుపెట్టినపుడు.. పది నెలలో ఆ పైనో తను ఉపయోగించుకునే చాంబర్‌లో వసతుల కోసం రూ. 10 కోట్లు మాత్రమే ఖర్చుపెడుతున్నారంటే.. ఎంత పొదుపు పాటిస్తున్నట్లో కాదా?!   కానీ.. సచివాలయ ఉద్యోగులు మాత్రం.. రేపో మాపో వదిలి వెళ్లిపోయే చాంబర్ కోసం ఏకంగా రూ. 10 కోట్లు దుబారా చేయటమేమిటని విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తన చాంబర్ కోసం సచివాలయంలోని ఎల్ బ్లాకులో ఎనిమిదో అంతస్తును ఎంచుకున్నారు. ఇప్పుడా చాంబర్ ఆధునీకరణకు ప్రభుత్వం రూ. 10 కోట్లు ఖర్చు చేస్తోంది.  ఎల్ బ్లాకులోని 8వ అంతస్తులో ముఖ్యమంత్రి, 7వ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాల కోసం ఇప్పటికే ఉన్న భవనంలో పది కోట్ల రూపాయలు వెచ్చించి ఏం ఏర్పాట్లు చేస్తున్నట్టు అని సచివాలయంలోని ఉద్యోగులంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

ఈ కార్యాలయాల కోసం సౌకర్యాల కల్పన, ఫర్నిచర్ కోసం రహదారులు - భవనాల శాఖ పది కోట్ల రూపాయలను (జీవో ఆర్‌టీ నంబర్ 541) విడుదల చేసింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించడంతో ఆ శాఖ స్వల్పకాలిక టెండర్లతో పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించి మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎక్కడో నిర్ణయించిన తర్వాత సాధ్యమైనంత తొందరగా అక్కడికి మారాలని భావిస్తున్న దశలో.. సీఎం చంద్రబాబు తాత్కాలిక చాంబర్‌లో సౌకర్యాలు, ఫర్నిచర్ కోసం ఏకంగా రూ. 10 కోట్లు వెచ్చించడం ఇప్పుడు సచివాలయంలో హాట్ టాపిక్‌గా మారింది. పది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అసలు కొత్తగా క్యాంపు కార్యాలయమే నిర్మించవచ్చని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
 హెచ్ బ్లాక్‌లో రూ. 3 కోట్ల ఖర్చు వృథా...
 రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టే సీఎం కోసం సచివాలయంలోని హెచ్  బ్లాక్ సరిగ్గా సరిపోతుందని భావించారు. గవర్నర్ ఆదేశాల మేరకు కొత్త సీఎం కోసం హెచ్ బ్లాకులో సీఎం కార్యాలయం కోసం దాదాపు రూ. 3 కోట్లు వెచ్చించి సర్వహంగులూ పూర్తి చేశారు. అయితే చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయన సన్నిహితులు, జ్యోతిష్యులు దాన్ని పరిశీలించి వాస్తు సరిగా లేదంటూ.. సీఎం కోసం ఎల్ బ్లాకును ఎంపిక చేశారు. దాంతో హెచ్ బ్లాకులో సీఎం కార్యాలయం కోసం వెచ్చించిన రూ. 3 కోట్లు వృథా అయ్యాయి. అలాగే.. చంద్రబాబు క్యాంపు కార్యాలయం కోసం లేక్‌వ్యూ అతిథి గృహాన్ని కేటాయించగా.. తొలుత అక్కడికి కూడా వెళ్లబోనని ఆయన అధికారులకు సమాచారం పంపించారు. దాంతో అధికారులు ఆయన కోరిన మరో చోట క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా చివరకు లేక్‌వ్యూనే ఎంచుకున్నారు.
 
 పొదుపు చేయాలంటూ ఇంత దుబారానా?
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం నిధులు లేవంటూ విరాళాలు ఇవ్వాలని ఒకవైపు ప్రజలను కోరిన చంద్రబాబు తాత్కాలికంగా పనిచేసే తన పేషీ కోసం పది కోట్లు వెచ్చించడం సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం పెద్ద ఎత్తున విరాళాలు కోరడమే కాకుండా ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా అకౌంట్‌ను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అలాగే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేని పరిస్థితుల్లో పొదుపు పాటించాలని మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వమే అనవసరపు ఆర్భాటాలు చేయటమేమిటని సచివాలయం ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
 
 గతంలో సీఎం కోసం నాలుగు కోట్లు వెచ్చింది శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయం, అధికారిక నివాస గృహం రెండింటినీ నిర్మిస్తే గగ్గోలు పెట్టిన వారే.. హెచ్ బ్లాకులోనూ రూ. 3 కోట్ల వ్యయంతో అధునాతన సదుపాయాలతో సర్వం సిద్ధం చేసిన తర్వాత వాస్తు కారణం చూపి ఎల్ బ్లాకులో కొత్త కార్యాలయం కోసం ఏకంగా రూ. 10 కోట్లు వెచ్చిస్తుండటం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా.. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు మాత్రమే ఉంటుందని, ఆ తరువాత హైదరాబాద్‌ను వీడి వెళ్లాల్సి ఉన్నందున ఇక్కడ ఎలాంటినిర్మాణాలు చేపట్టినా, వాటిని వదిలి వెళ్లాల్సిందనే ఆలోచనను ప్రభుత్వం విస్మరిస్తోందని ఉన్నతాధికారులు తప్పుపడుతున్నారు.
 
 ఇంతకూ రూ. 10 కోట్లతో ఎల్ బ్లాకులో 7, 8 అంతస్తుల్లో ఏం చేస్తున్నారంటే..
 *    విశాలమైన హాలు కోసం మధ్య గోడలను తొలగించారు
 *    భోజనం చేయడానికి అవసరమైన డైనింగ్ హాల్ నిర్మాణం చేపడతారు
 *    ముఖ్యమంత్రి ఏకాంతంగా మాట్లాడేందుకు వీలుగా ప్రత్యేక హాల్‌ను తీర్చిదిద్దుతున్నారు
 *    సందర్శకుల కోసం ప్రత్యేక హాల్ నిర్మాణం చేపడతారు
 *    అధికారులతో సమీక్షల కోసం కాన్ఫరెన్స్ హాలు, వీడియో కాన్ఫరెన్స్ హాళ్లను నిర్మిస్తారు
 *    మంత్రివర్గ సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేస్తారు
 *    8వ అంతస్తులోనే సీఎం కార్యాలయ అధికారుల కోసం కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు
 *    8వ అంతస్తుకు నేరుగా వెళ్లడానికి ప్రత్యేకంగా లిఫ్ట్ ఏర్పాటు
 *    8 వ అంతస్తు చుట్టూ బులెట్ ప్రూఫ్ అద్దాల ఏర్పాటు
 *    ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఆ అంతస్తులోని అన్నింటికీ కొత్తగా అధునాతన ఫర్నిచర్
*    7 వ అంతస్తులో సీఎస్ కార్యాలయం ఏర్పాటు
*    సీఎస్ సమీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు
*    అక్కడే సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయం ఏర్పాటు
*    వీరికి కూడా కొత్త ఫర్నిచర్

మరిన్ని వార్తలు