తెలుగుజాతిపై యుద్ధం చేస్తారా?

19 Mar, 2018 02:02 IST|Sakshi

బీజేపీపై సీఎం చంద్రబాబు మండిపాటు

తమిళనాడు తరహా రాజకీయాలను ఏపీలో సాగనివ్వను

ఉగాది వేడుకల్లో సీఎం రాజకీయ ప్రసంగం

 

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే బీజేపీ తమపై ఎదురుదాడి చేస్తామంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. న్యాయం చేయమని అడిగితే యుద్ధం చేస్తారా? అని ప్రశ్నించారు. ఎవరిపై యుద్ధం చేస్తారు, తెలుగుజాతిపై చేస్తారా? అని అన్నారు.

ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు మాట్లాడారు. తెలుగుజాతికి ఎన్టీఆర్‌ ఆత్మగౌరవాన్ని ఇచ్చారని, తాను ఆత్మవిశ్వాసాన్ని ఇస్తానని చెప్పారు. జపాన్‌ తరహాలో అభివృద్ధి చేసుకుంటూనే పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను బలహీనపడితే రాష్ట్రం బలహీనపడుతుందని పేర్కొన్నారు.

తమిళనాడులో చేసినట్లు ఇక్కడా చేయాలని చేస్తున్నారని, ఇక్కడ తమిళనాడు తరహా రాజకీయాలు జరగనివ్వబోనని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం ప్యాకేజీతోపాటు ప్రత్యేక హోదా ఇచ్చేదాకా తమ పోరాటం ఆగదన్నారు. నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించలేదని ఆరోపించారు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు. ఈ సంవత్సరం సాధారణ పంచాంగంతోపాటు పోలవరం పంచాంగం, ఉద్యానవన పంచాంగం కూడా విడుదల చేశామన్నారు.

ఒడిదుడుకులుంటాయి: సుబ్రహ్మణ్యశర్మ
ఉగాది వేడుకల్లో రాజమండ్రికి చెందిన డాక్టర్‌ ప్రభల సుబ్రహ్మణ్యశర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ తట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం స్థిరంగా స్వతంత్రంగా నిలబడుతుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల మధ్య సంబంధాలు పాలకుల వ్యక్తిత్వాలను బట్టి ఉంటాయన్నారు.

ఈ ఏడాది శుభ ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. పంట సాగుకు అను కూలంగా మంచి వర్షాలు కురుస్తాయన్నారు. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ రూపొందించిన వ్యవసాయ పంచాంగాన్ని రావూరి వెంకటసాయి వరప్రసాద్‌ చదివి వినిపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 47 కళారత్న, 99 ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి, జయప్రకాశ్‌ తదితరులకు హంస అవార్డులను అందించారు. టీటీడీ, వ్యవసాయ, ఉద్యానవన, పోలవరం పంచాంగాలను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి తన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్‌‡్షతో కలిసి వచ్చారు. అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు