ఐటీ అధికారుల సెక్యూరిటీ విత్‌డ్రా చేసుకుంటాం : చంద్రబాబు

5 Oct, 2018 20:47 IST|Sakshi

ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం

కేంద్రంపై పోరాటానికి సిద్ధమన్న సీఎం చంద్రబాబు

ఐటీ అధికారులకు సెక్యూరిటీ విత్‌ డ్రా చేసుకోవాలని కేబినెట్‌ తీర్మానం

సాక్షి, అమరావతి : టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఓటుకు కోట్లు కేసు విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఐటీ దాడులు జరిగినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ అత్యవసరంగా సమావేశమైంది. తాజా రాజకీయ పరిణామాలు, ఐటీ దాడులపై వాడీవేడిగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్బంగా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే సిద్ధంగా ఉండాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. కక్ష సాధింపు చర్యల్లోనే భాగంగా కేంద్రం ఈ దాడులు జరిపిస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ విధంగా చేయడం ద్వారా రాష్ట్ర పరువును తీయాలని చూస్తోందంటూ విమర్శించారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా అన్ని రాష్ట్రాల్లోనే ఈ తరహా దాడులు చేసేందుకు కేంద్రం స్కెచ్‌ వేసిందంటూ ఆరోపించారు. రాజకీయ దాడులకు సపోర్టు చేసేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై అన్ని స్థాయిల్లో పోరాటానికి సిద్ధంగా ఉండాలని కేబినెట్‌కు సూచించారు.

సెక్యూరిటీ విత్‌ డ్రా చేసుకుంటాం..!
రాజకీయ దురుద్దేశంతోనే కేంద్రం దాడులు చేయిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. విద్యుత్ చార్జీలను యూనిఫారంగా ఉండేలా చేస్తామంటూ కేంద్రం రాష్ట్రాల నుంచి విద్యుత్ రంగాన్ని లాక్కోవాలని చూస్తుందని మండిపడ్డారు. అన్నీ లాక్కుంటే రాష్ట్రాలు ఈగలు తోలుకుంటూ కూర్చోవాలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లా అండ్‌ ఆర్డర్‌ రాష్ట్ర పరిధిలోని అంశమేనన్న చంద్రబాబు...ఐటీ దాడుల నేపథ్యంలో ఐటీ అధికారులకు సెక్యూరిటీ విత్‌ డ్రా చేసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బతీస్తున్నారనే అంశమై సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాన్ని పరిశీలించాలని లా సెక్రటరీని ఆదేశించారు.

మరిన్ని వార్తలు